ఉపాధి వేతన దారుల సమస్యలు తీర్చండి…!

  • ఎండలు మండుతుండడంతో ఒక్క పూట పనులు నిర్వహించాలి.
  • నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్, మందులు, టెంట్లు ఏర్పాటు చేయాలి
  • ఫీల్డ్ అసిస్టెంట్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి
  • ఐటిడిఏ పిఓను కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం,, ఉపాధి వేతనదారుల సమస్యలు తీర్చాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్ ను కలిసిన జనసేన పార్టీ జిల్లా నాయకులు వంగల దాలినాయుడు, రాజాన రాంబాబు, మండల శరత్ కుమార్, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, రౌతు బాలాజీ నాయుడు, వెళ్లంకి వెంకటేష్ తదితరులు జిల్లాలోని ఉపాధి వేతనదారుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఎండలు మండుతున్నాయని, దాదాపు 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. దీంతో రెండు పూటలా ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులు వడదెబ్బకు గురవుతున్నారన్నారు. కాబట్టి ఎండలు అధికంగా ఉన్నంతకాలం ఒక్క పూట ఉపాధి పనులు నిర్వహించాలన్నారు. అలాగే మట్టి గట్టిగా ఉండటంతో పనులు జరగటంలేదని కొలతలతో సంబంధం లేకుండా కనీస వేతనం ఇవ్వాలన్నారు. అలాగే ఉపాధి పనుల వద్ద టెంట్లు, మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్, మందులు, తదితర వసతులు కల్పించాలన్నారు. ఏడాదికి 200 రోజులు పని దినాలు కల్పించి, రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలన్నారు. అదే విధంగా ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల ఆగడాలను అరికట్టాలన్నారు. కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాల్లో లేని వ్యక్తులు పనికి వచ్చినట్టు హాజరు వేయటం. జాబు కార్డు ఉన్నటువంటి వారికి పనికి రాకపోయినా హాజరు వేయటం, పనికొచ్చినా ఇష్టం లేని వారి హాజరు తగ్గించడం, వారం వారం బిల్లుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడడం జరుగుతుందని తమ దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ వీటిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.