‘మణికర్ణిక’లో సోనూసూద్ లుక్

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఎన్నో సేవాకార్యక్రమాలు, ఆపదలో ఉన్న వారిని ఆర్థికంగా ఆదుకున్న గొప్ప వ్యక్తి. ఆపదలో ఉన్నారని తెలిస్తే అర సెకను కూడా ఆలస్యం చేయకుండా వారిని ఆదుకొనే గొప్ప మనసు. కోట్లల్లో డబ్బులను పేదల అవసరాల కోసం సాయం చేసి మనసున్న మారాజుగా పేరు పొందారు నటుడు సోనూసూద్.

ప్రస్తుతం తనకి సంబందించిన ఏ చిన్న వార్త అయినా వైరల్ అయ్యేంత క్రేజ్ సంపాదించుకున్నాడు సోనూసూద్.. అప్పట్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక సినిమాలో కూడా మొదట సోనూసూద్ నటించారు. అయితే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత సోనూసూద్ సినిమా నుంచి తప్పుకున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

సోనూసూద్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ‘మణికర్ణిక’ చిత్రానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు. దర్శకుడు క్రిష్ తో కలిసి సిక్స్ ప్యాక్స్ బాడీతో, అడ్డంగా బొట్టు పెట్టుకుని, మెలేసిన మీసంతో.. గంభీరంగా నడుస్తున్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. సోనూసూద్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ దీనికి ‘జీవితంలో మంచి కోసం నడవండి.. ఏదో ఒక రోజు మీరు సాధిస్తారు.” అంటూ క్యాప్షన్ పెట్టారు. అయితే మణికర్ణిక సినిమాలో కొన్ని మార్పులు చేయాలని, సోనూసూద్ పాత్రను తగ్గించాలని హీరోయిన్ కంగనా వాదించడంతో దర్శకుడు క్రిష్ బాధ్యతల నుంచి తప్పుకున్నారని, సోనూసూద్ కూడా సినిమా నుంచి తప్పుకున్నారని సమాచారం. అభిమానులు మాత్రం ఈ ఫొటోలు చూశాక సోనూ నటించి ఉంటే సినిమా మరోస్థాయి చేరేదని కొనియాడుతున్నారు.