గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి..!

  • విద్యార్థుల మరణాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
  • మలేరియా, డెంగ్యూ జ్వరాలకు జిల్లా ఆస్పత్రిలో పూర్తిస్థాయి చికిత్స అందించండి
  • బ్లడ్ కాంపోనెంట్ మిషన్ అందుబాటులోకి తీసుకురావాలి
  • మాత శిశు మరణాలు లేకుండా చూడాలి
  • దోమల నివారణకు చర్యలు చేపట్టాలి
  • డిప్యూటీ డిఎం అండ్ హెచ్.ఓ.ని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. గురువారం జనసేన జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ లు పార్వతీపురం ఐటిడిఏ కార్యాలయంలోని డిప్యూటీ డి.ఎం. అండ్ హెచ్.ఓ.గంట వెంకట రమణను కలిసి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోగల మండలాల్లోని గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రోగాల సీజన్ ప్రారంభమైందన్నారు. ఇప్పటికే డెంగ్యూ, మలేరియా, వైరల్, టైఫాయిడ్ తదితర రోగాలు తమ ప్రతాపాన్ని చూపుతున్నాయన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు చెందిన గిరిజనులు అధికంగా వీటి భారిన పడుతున్నారన్నారు. కాబట్టి తొలుత గిరిజన ప్రాంతాల్లోని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మలేరియా దోమల నివారణ మందులు ఏసీఎం 5%, ఎ బే ట్ తదితర క్రిమిసంహారక మందులు పిచికారి చేయించాలన్నారు. అలాగే దోమతెరలు వినియోగంపై గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. మలేరియా, డెంగ్యూ జ్వరాలకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం రిఫరల్ చేయకుండా పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో పూర్తిస్థాయి చికిత్స అందించాలని కోరారు. అలాగే దీనికి అవసరమైన బ్లడ్ కాంపోనెంట్ మిషన్ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పలు గిరిజన గ్రామాలకు రాకపోలు సాగించేందుకు వాహన సదుపాయాలు ఉండవని అటువంటి గ్రామాల్లో తరచు వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి నుండి పీహెచ్ స్థాయి వరకు వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు లేకుండా భర్తీ చేసి మెరుగైన వైద్య సేవలు గిరిజనులకు అందేలా చూడాలన్నారు. అలాగే వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రతి ఏటా ఈ సీజన్లో అధికంగా రోగాలకు లోను కావడం ఒకరిద్దరు మృత్యువాత పడటం జరుగుతుందన్నారు. అటువంటి సంఘటనలు ఈ ఏడాది లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి, మాత శిశు మరణాలు లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా వారు వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నామని, గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.