నకిలీ గోల్డ్ బిస్కెట్స్‌ ముఠా గుట్టు రట్టు చేసిన శంషాబాద్ జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్

తక్కువ ధరకు బంగారం అంటూ ప్రజలను మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను శంషాబాద్ జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ గురువారం అరెస్ట్ చేసింది. వారిలో రిజిస్టర్డ్ ఆర్‌ఎంపీ కూడా ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ. 8 లక్షల నగదు, 5.85 కిలోల నకిలీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఓల్డ్‌మల్లేపల్లికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు సయ్యద్‌ దస్తగిరి అహ్మద్‌, షేక్ హఫీజ్, అలీ అక్బర్ తయ్యాబీ, మీర్జా అబ్బాస్‌లుగా గుర్తించారు. మరో నిందితుడు అబ్దుల్‌ ఫహీమ్‌ పరారీలో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. సయ్యద్‌ దస్తగిరి అహ్మద్‌ తనకు తాంత్రిక విద్యలు తెలుసని, ఇంట్లో కనిపించకుండా ఉన్న బంగారం నిధులను బయటకు తీస్తానంటూ అమాయకులను నమ్మించి మోసాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫహీమ్, హఫీజ్‌లను కూడా సయ్యద్ మోసం చేశాడు. అదే విదంగా అబ్బాస్, అతని స్నేహితుడు త్యాబీలు అనే సయ్యద్‌ వద్దకు వచ్చాడు. తన తల్లికి ఇంట్లో బంగారం నిధులు ఉన్నట్టుగా కలలు వస్తున్నాయని అబ్బాస్ చెప్పాడు. దీంతో సయ్యద్ వెంటనే సజ్జద్ ఇంటికి వెళ్లాడు. కార్యక్రమాలు అని పూర్తిచేసి నిధులు బయటు తీయాలంటే రూ. 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. దీంతో సజ్జద్.. రూ. 3 లక్షల అడ్వాన్స్ చెల్లించాడు.

దీంతో సయ్యద్ తన ప్లాన్‌ను అమలు చేశాడు. ఇత్తడి ముక్కలను సేకరించి గోల్డ్ కోటింగ్ చేయించి ఫహీమ్‌కు ఇచ్చాడు. తర్వాత అనుకున్న తేదీన అబ్బాస్ ఇంట్లో తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే ఆ సమయంలో అబ్బాస్ అతని కుటుంబ సభ్యులను దృష్టిని మళ్లించిన సయ్యద్.. ఆ గుంతల్లో నకిలీ బంగారాన్ని ఉంచాడు. నిధులు బయటపడ్డాయని వారిని నమ్మించాడు. నకిలీ బంగారాన్ని ప్యాక్ చేసి అబ్బాస్ చేతికి అందజేశాడు. ఆ బంగారాన్ని ఇప్పుడే తెరవద్దని సజ్జద్‌కు చెప్పాడు.

ఇక, సయ్యద్ అక్కడి నుంచి వెళ్లిపోయాక.. ఉత్సాహం ఆపుకోలేని అబ్బాస్ ఆ మూటను తెరచి చూడగా.. అందులో ఇత్తడి ముక్కలు దర్శనమిచ్చాయి. దీంతో అతడు సయ్యద్ వద్దకు వెళ్లి నిలదీశాడు. అయితే తాను సరైన సమయంలో తెరవకపోవడం వల్లే బంగారం మొత్తం.. ఇత్తడిగా మారిందంటూ సయ్యద్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తమకు జరిగిన నష్టాన్ని రికవరీ చేసుకునేందుకు.. అబ్బాస్, తయ్యాబీలు ఇతరులను మోసం చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే తక్కువ ధరకే బంగారం అంటూ నకిలీ బంగారాన్ని విక్రయించడం మొదలుపెట్టారు. అయితే ఆ బంగారం కొనుగోలు చేసిన ఒకరు.. తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్ నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. అనంతరం వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం వారికి జ్యూడిషియల్ కస్టడీ విధించింది.