వామనరావు దంపతుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్ట్‌

పెద్దపల్లి: లాయర్‌ వామనరావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్‌ చేశారు. బిట్టు శ్రీనును మంథనిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వామనరావు దంపతులపై దాడి చేసిన వారికి ఆయుధాలు, వాహనాలు సరఫరా చేసినట్లు బిట్టు శ్రీనుపై ఆరోపణలున్నాయి. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు బిట్టు శ్రీను మేనల్లుడు.

ఇప్పటికే వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుంటశ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌, వసంతరావు, చిరంజీవిని పోలీసులు విచారిస్తున్నారు. పెద్దపల్లి మండలంలోని కల్వచర్ల వద్ద గట్టు వామనరావు, నాగమణిలు పట్టపగలే దారుణ హత్యకు గురయ్యారు. వామనరావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పైన పేర్కొన్న నలుగురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులను ఈరోజు రాత్రి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంట శ్రీనివాస్‌ను టిఆర్‌ఎస్‌ నుండి సస్పెండ్‌ చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. కాగా, ఈ హత్య వెనుక రాజకీయ కోణం లేదని పోలీసులు చెబుతున్నారు.