ప్రారంభమైన శ్రీవారి బ్రహోత్సవాలు

తిరుమలవాసుని  వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణపూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు  సాయంత్రం మీన లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో స్వామివారి వాహనసేవలు కూడా ప్రారంభమవుతాయి. రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేష వాహనసేవ ఉంటుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా సేవలన్నీ ఆలయంలో ఏకాంతంగానే జరుగుతాయని టిటిడి అధికారులు ముoదుగానే తెలియ జేశారు.

ఈసారి బ్రహ్మోత్సవాలకు కంకణ భట్టాచార్యులుగా శ్రీవారి ఆలయ సీనియర్‌ అర్చకుడు ఏఎస్‌ గోవిందాచార్యులు వ్యవహరించనున్నారు. ధ్వజారోహణంలో భాగంగా ధ్వజస్తంభంపైకి గరుడపతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. పండితులు వేదమంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. అనంతరం శ్రీవారి వాహనసేవలు జరుగుతాయని అధికారులు తెలిపారు. నేటి నుంచి 27 వరకూ సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈ నెల 27 వ తేదీ చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టీటీడీ ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. 23 వ తేదీన జరిగే గరుడసేవలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.

శ్రీవారి గరుడసేవ కార్యక్రమానికి సీఎం జగన్‌తోపాటు కర్నాటక సీఎం యడ్యూరప్ప కూడా హాజరవుతారని టిటిడి అధికారులు తెలిపారు. ఇద్దరు సీఎంలు సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.