సత్ఫలితాలిస్తున్న ‘2డీజీ’

చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రిలో ‘2డీజీ’ మందు ప్రయోగాత్మక వినియోగం సత్ఫలితా లనిస్తోందని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యం లో, డీఆర్‌డీవో, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ సంయుక్తంగా ‘2-డియోక్సీ-డి-గ్లూకోజ్‌’ గ్లూకోజ్‌ (2డీజీ)’ పేరిట కరోనా నివారణకు మందును రూపొందించాయి. దేశవ్యాప్తంగా 30కి పైగా ప్రభుత్వాస్ప త్రుల్లో 3వ విడతగా ఈ మందును ప్రయోగాత్మకంగా వినియోగించగా, వాటిలో చెంగల్పట్టు ప్రభుత్వ వైద్యకళా శాల ఆస్పత్రి ఒకటి. ఈ విషయమై ఆస్పత్రి కార్డియాలజిస్ట్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ… ‘2డీజీ’ మందు అలోపతి వైద్య విధానంలో తయారైందని, తమ ఆస్పత్రిలో రెండు దశల్లో 18 నుంచి 65 ఏళ్ల వయస్సున్న 20 మంది బాధితులపై ప్రయోగించామన్నారు.

తొలుత బాధితులకు మందుపై అవగాహన, వారి సందేహాలు నివృత్తి చేశాక, వారి అనుమతితో పరిశోధనలు చేపట్టామని తెలిపారు. తొలి దశలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని బాధితులకు నీటిలో కలిపిన మందును అందజేశామని, బాధితులు 4 నుంచి 5 రోజుల్లో కరోనా వైరస్‌ నుంచి కోలుకొని నెగటివ్‌ వచ్చిందన్నారు. బాధితుడి బరువును బట్టి ఎంత మందు ఇవ్వాలో నిర్ణయించామని, ఈ మందు సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న మందుల కన్నా ‘2డీజీ’ మందుతో ఆక్సిజన్‌ అవసరాలు తగ్గుతాయని తెలిపారు.