విజయవంతంగా ముగిసిన రైతుల భారత్ బంద్

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నిర్వహించిన భారత్ బంద్ ముగిసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ బంద్ సందర్భంగా అనేక జాతీయ రాష్ట్ర రహదారులు మూతపడ్డాయి. అనేక మార్గాలలో ట్రాఫిక్ ను మళ్లించాల్సి వచ్చింది. బంద్ ప్రభావం రైళ్లపై కూడా పడింది. ఢిల్లీ నుంచి బయలుదేరే అనేక రైళ్లు రద్దు చేశారు. హర్యానా పంజాబ్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దు కూడా 10 గంటల పాటు మూసివేశారు. కొద్దిసేపటి క్రితం దీనిని తెరిచారు.

భారత్ బంద్ లో దేశంలోని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆర్జేడీ ఆమ్ ఆద్మీ బీఎస్పీ సమాజ్ వాది పార్టీ వామపక్షాలు వైసీపీ భారత్ బంద్ కు మద్దతు ఇచ్చాయి. బంద్ కు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసి) నుంచి మద్దతు లభించింది. అదే సమయంలో రైతులు ఆందోళనను విరమించి చర్చల మార్గాన్ని అవలంభించాలని ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది. రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు.

ఇక భారత్ బంద్ పూర్తిగా విజయవంతమైనదని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికైత్ అన్నారు. ఇప్పుడు యునైటెడ్ కిసాన్ మోర్చా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రదర్శన సమయంలో ఢిల్లీ-సంఘ సరిహద్దుల్లో ఒక రైతు మరణించాడు. అతడు గుండెటపోటుతో మరణించాడని పోలీసులు చెబుతున్నారు. మరణించిన రైతును భాగెల్ రామ్ గా గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.

పెద్దసంఖ్యలో రైతులు నోయిదా అథారిటీ సమీపంలో గుమిగూడి పోలీస్ బారికేడింగ్ ను బద్దలు కొట్టారు. దీని తర్వాత వారు నోయిడా అథారిటీ వైపు దూసుకుపోయారు.

ఇక భారత్ బంద్ లో కీలక పాత్ర పోషిస్తున్న పంజాబ్ రైతులు ఇది దేశవ్యాప్తంగా విజయవంతమైందని ప్రకటించారు. పంజాబ్ లోని లుథియానాలోని లాడోవల్ టోల్ ప్లాజా ఎంబీడీ మాల్ ఫిరోజ్ పూర్ రోడ్డు వద్ద నిరంతరం సిట్ ఇన్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ రోడ్డు మూసివేశారు. పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. పరీక్షలు ఆన్ లైన్ లో నిర్వహించారు. ఉపాధ్యాయులు ఇంటి నుంచి పనిచేశారు. చాలా పరీక్షలు వాయిదా పడ్డాయి.

ఇక భారత్ బంద్ గత కొన్నేళ్లలో ఇంత మద్దతు లభించడం ఇదే తొలిసారి అని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావలే అన్నారు. 25కు పైగా రాష్ట్రాలలో బంద్ విజయవంతమైనదని వివరించారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.