పారాలింపిక్స్: భారత్ కు మరో స్వర్ణం.. జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు నెలకొల్పిన సుమీత్ ఆంటిల్

టోక్యో పారాలింపిక్స్ లో భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు సుమీత్ ఆంటిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఎఫ్64 కేటగిరీలో నేడు జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో సుమీత్ ఆంటిల్ స్వర్ణం గెలిచాడు. జావెలిన్ ను 68.55 మీటర్ల దూరం విసిరిన సుమీత్ ఈ క్రమంలో సరికొత్త వరల్డ్ రికార్డు కూడా నమోదు చేశాడు. విశేషం ఏంటంటే… తన తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్లు విసిరిన సుమీత్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఆపై రెండో ప్రయత్నంలో మరింత మెరుగయ్యాడు. ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి నూతన ప్రపంచ రికార్డుతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

ఈ పోటీలో ఆస్ట్రేలియాకు చెందిన మైఖేల్ బరియాన్ రజతం సాధించగా, శ్రీలంక పారా అథ్లెట్ దులన్ కొడితువాక్కు కాంస్యం దక్కించుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మహిళా షూటర్ అవని లేఖర తొలి స్వర్ణం అందించడం తెలిసిందే.