ఫేస్‌బుక్ ఇండియా ఎoడీ కి సమన్లు

ఫేస్‌బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్‌కు దిల్లీ అసెంబ్లీ శాంతిభద్రతల కమిటీ సమన్లు పంపించింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ఈ సమన్లు జారీ అయ్యాయి. శాంతి, సామర్యం అంశంపై ఎమ్మెల్యే రాఘవ్ నేతృత్వంలోని అసెంబ్లీ కమిటీ అజిత్ మోహన్‌కు లేఖ రాసింది. మంగళవారం తమ ముందు హాజరుకావాలంటూ కమిటీ తన లేఖలో ఆదేశించింది. పలువురి నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగానే ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీ చేసినట్లు కమిటీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఫేస్‌బుక్ పాత్ర ఉన్నట్లు ఆగస్టు 31వ తేదీన జరిగిన సమావేశంలో కమిటీ భావించింది. భాజపాకు అనుకూలంగా ఫేస్‌బుక్‌ పనిచేస్తోందంటూ ఆగస్టు 14న అమెరికాకు చెందిన ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని బలపరుస్తూ అనేక మంది ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగానే కమిటీ ఈ విచారణను చేపట్టి ఉపాధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది. అయితే తదుపరి సమావేశానికి ఫేస్‌బుక్ ఇండియా అధికారులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.