లఖీంపూర్‌ హింసాకాండపై సుప్రీంలో విచారణ.. ప్రభుత్వ తీరుపై సీజేఐ అసంతృప్తి

దేశంలో కలకలం రేపిన లఖీపూర్‌ ఖేరి హింసపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మరణించారు. అక్టోబరు 3న జరిగిన ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది.

సిట్‌ నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు కోరింది. యూపీ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ నివేదికను సమర్పించేందుకు శుక్రవారం వరకూ గడువు కోరారు. దీనికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ నివేదికను సాల్వే న్యాయస్థానానికి సమర్పించారు.

ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై చీఫ్ జస్టిస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ”నివేదిక కోసం మంగళవారం రాత్రి చాలాసేపు న్యాయమూర్తులు ఎదురు చూశారు. మీరు ఇప్పుడు నివేదిక సమర్పిస్తున్నారు” అంటూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే సీల్డు కవరులో వచ్చిన రిపోర్టులో కేవలం నలుగురు సాక్షుల వాంగ్మూలాలే ఉన్న విషయాన్ని కూడా సీజేఐ ఎత్తిచూపారు.

”సాక్షుల్లో ఎవరికి బెదిరింపులు, హాని కలిగే ప్రమాదం ఉందో మీ సిట్‌ గుర్తించగలదు. అలాంటప్పుడు కేవలం నలుగురు సాక్షుల వాంగ్మూలాలే ఎందుకు తీసుకున్నారు?” అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో సాక్షులకు రక్షణ కల్పిస్తామని యూపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ఈ కేసులో దర్యాప్తు ముగింపు లేని కథలా మిగలకూడదని, పోలీసుల దర్యాప్తు నత్త నడకన సాగుతోందనే అనుమానాలను ప్రభుత్వమే చెరిపివేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

మిగతా సాక్షుల వాంగ్మూలాలు కూడా సేకరించడం కోసం యూపీ ప్రభుత్వం సమయం అడగడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అక్టోబరు 26లోపు తదుపరి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.