సంగం డెయిరీ స్వాధీనం నిలిపివేత

సంగం డెయిరీని స్వాధీనం చేసుకొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 27న ఇచ్చిన జీవో 19 అమలును నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. డెయిరీ యాజమాన్య బాధ్యతలు, యూనియన్‌పై సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌ఎంపీసీఎల్‌) నియంత్రణ కలిగి ఉండొచ్చని స్పష్టం చేసింది. డెయిరీ నిర్వహణ బాధ్యతలను ఐఏఎస్‌ అధికారికి అప్పగించడం పాలనా పరమైన ఇబ్బందులకు దారి తీస్తుందని పేర్కొంది. డెయిరీ నిర్వహణ ప్రత్యేక నిపుణులతో ముడిపడి ఉన్నందున పరిపాలన, నిర్వహణ వ్యవహారాలు కంపెనీ డైరెక్టర్లు చేపట్టేలా ఆదేశించింది. డెయిరీ ప్రాంగణంలోకి తెనాలి సబ్‌ కలెక్టర్‌ వెళ్లాల్సిన అవసరం లేదని, కార్యకలాపాల్లో కల్పించుకోకూడదని తేల్చిచెప్పింది. ‘జీతాలు, చట్టబద్ధమైన బకాయిల చెల్లింపులు, ఒప్పంద బాధ్యతలు, రోజువారీ కార్యకలాపాలను ఎస్‌ఎంపీసీఎల్‌ పర్యవేక్షించవచ్చు. అయితే, కోర్టు అనుమతి లేకుండా ఆస్తులపై హక్కులు కల్పించడం, తనఖా పెట్టడం, విక్రయించడం చేయరాదు. పాల కొనుగోలు, ప్రాసెసింగ్‌, విక్రయించడం వంటి సాధారణ పనులను కంపెనీ యథాతథంగా కొనసాగించవచ్చు’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.