ఎస్.వి.ప్రసాద్ కార్యదక్షత నవతరం అధికారులకు ఆదర్శం: పవన్ కల్యాణ్

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి హోదాలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్.వి.ప్రసాద్ తుది శ్వాస విడిచారనే విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. “ఎస్.వి.ప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని పవన్ తెలిపారు.

“ఐ.ఏ.ఎస్. అధికారిగా ఎన్నో కీలకమైన బాధ్యతలు చేపట్టి ప్రజలకు మేలు చేసేలా విధులు నిర్వర్తించిన కర్మశీలి ప్రసాద్ గారు. నిరాడంబరంగా ఉండే ఆయన ఎన్నడూ అధికారదర్పం ప్రదర్శించకుండా ప్రజాహితం గురించే ఆలోచించారు. ప్రసాద్ గారితో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. నాపట్ల ఎంతో ప్రేమాభిమానాలు కనబరచేవారు. వివిధ సందర్భాల్లో కలసి మాట్లాడినా 2018లో మా మధ్య సుదీర్ఘంగా సాగిన చర్చను ఎప్పటికీ మరచిపోలేను. ప్రసాద్ గారు సమాజ క్షేమం, ప్రజాభ్యున్నతి గురించి, అందుకు ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలు, సంస్కరణల గురించి తెలిపారు. నిబద్ధతతో పని చేసిన శ్రీ ప్రసాద్ గారి కార్యదక్షత నవతరం అధికారులకు ఆదర్శంగా నిలుస్తుందని” పవన్ కల్యాణ్ అన్నారు.