ఎస్పీ బాలుకు తమిళనాడు అసెంబ్లీ నివాళులు

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గత ఏడాది తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. భౌతికంగా మనకు దూరమైన పాట రూపంలో ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు. ఆయన మృతి ఇప్పటికీ ప్రతి ఒక్కరికి పీడ కలగానే మారింది. 16 భాషలలో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలు దేశ వ్యాప్తంగా ఉన్న శ్రోతలను రంజింపజేశారు. ఇటీవల తమిళనాడు రాష్ట్రం తరపున కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌తో గౌరవించింది.

ఇక ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో సమావేశాలు జరుగుతుండగా, అసెంబ్లీ ప్రారంభానికి ముందు దివంగత బాలుకు ఘన నివాళులు అర్పించారు. చెన్నై చెపాక్‌లోని కళైవానర్‌ అరంగంలో ఏర్పాటైన అసెంబ్లీ సమావేశంలో బుధవారం స్పీకర్‌ ధనపాల్‌.. ఎస్పీ బాలు, అడయార్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శాంత, రాష్ట్రమంత్రి దురైకన్ను మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రులు, శాసన సభ్యులంతా బాలు మృతికి రెండు నిమిషాల మౌనం పాటించారు.