చెన్నై టెస్ట్‌లో టీమిండియా పరాజయం

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఒక వికెట్ నష్టానికి 39 పరుగులతో ఐదవ రోజు ఆట ప్రారంభించిన భారత్.. 192 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 227 పరుగల భారీ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్లతో భారత్‌ జట్టును ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ దెబ్బతీశాడు. అటు అర్థశతకాలతో ఓపెనర్ శుభ్ మన్ గిల్, కెప్టెన్ కోహ్లీ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బెస్, బెన్ స్టోక్ చెరో వికెట్ తీసుకున్నారు.

తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు 578 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ జో రూట్ 218 పరుగులతో అదరగొట్టాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. కీపర్ రిషబ్ పంత్ 91 పరుగులు, పుజారా 73 పరుగులో రాణించారు. 241 పరుగుల వెనుకంజలో ఉన్న టీమిండియాకు ఫాలో ఆన్ ఇవ్వకుండా ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 178 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 420 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కేవలం 192 పరుగులకే కుప్పకూలింది.

ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ 1-0తో ముందజంలో ఉంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు చెన్నెలోనే ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభంకానుంది.