తేజస్‌లో ప్రయాణించిన తేజస్వీ సూర్య

భాజపా యువ నేత, దక్షిణ బెంగళూరు నియోజకవర్గ ఎంపీ తేజస్వీ సూర్య తేజస్ యుద్ధవిమానంలో ప్రయాణించాడు. వైమానిక ప్రదర్శకు వచ్చిన ఆయన ఫ్లయింగ్‌ సూట్‌ ధరించి తేజస్‌లో విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎంపీ తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్‌ చేశారు. కాగా… భారత వాయుసేన శక్తి సామర్థ్యాలను చాటిచెప్పే ఎయిరో ఇండియా ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ వైమానిక ప్రదర్శన.. మూడు రోజుల పాటు సాగనుంది.

13వ ఎయిరో ఇండియా ప్రదర్శనను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రారంభించారు. హైబ్రిడ్‌ షోగా జరుగుతున్న ఈ ప్రదర్శనలో తొలి రోజు రఫేల్‌, అమెరికా వైమానిక సంస్థకు చెందిన బీ-1బీ ల్యాన్సర్‌ సూపర్‌సానిక బాంబర్‌లు అలరించాయి. నాలుగేళ్ల కిందట భారతీయ వైమానిక విభాగంలో చేరిన ఎల్‌సీఏ తేజస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సారంగ్‌, సూర్యకిరణ్‌ విమానాలు, సుఖోయ్‌ 30-ఎంకే1 వైవిధ్య విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. శుక్రవారం వరకు ఈ ప్రదర్శన సాగనుంది.