తెలంగాణ-ఏపీ: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త

సుధీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య సయోధ్య కుదిరి.. రెండు రాష్ట్రాల మధ్యబస్సుల రాకపోకలు మొదలు కాబోతున్నాయి. కరోనా కారణంగా ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఈ సేవలు ఇప్పుడు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం.. ఏపీలో 161258 కి.మీల మేర తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరుగనున్నాయి. ఇక తెలంగాణలో 160999 కి.మీ మేర 638 ఏపీ బస్సులను నడుపనున్నారు.

ఇన్నాళ్లు ఏఏ ఆర్టీసీలు.. ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు నడపాలనే దానిపై పీఠముడి నెలకొని బస్సుల రాకపోకలకు బ్రేక్ పడింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు దీనిపై సంతకాలు చేశారు. రెండు ఆర్టీసీల అధికారులు అనేకసార్లు సమావేశమయ్యారు. కాని చర్చలు విఫలమయ్యాయి. టీఎస్ ఆర్టీసీ మొండి పట్టుదలతో వ్యవహరించింది. దీంతో ఏపీ ఆర్టీసీ ఆ షరతులను అంగీకరించడం తప్ప మరో వేరే మార్గం లేకుండా పోయిందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.. తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో రెండు ఆర్టీసీ అధికారులు ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ రాత్రి నుంచి ఆంధ్ర తెలంగాణ మధ్య బస్సులు రోడ్లపైకి వస్తాయి.

అవగాహన ఒప్పందం ప్రకారం.. ఏపిలో తెలంగాణ 826 బస్సుల సర్వీసులను నడుపుతుంది. ఇక తెలంగాణలో ఏపీ ఆర్టీసీ మాత్రం కేవలం 638 బస్సులను మాత్రమే నడుపుతుంది. ఏపిఎస్ఆర్టిసి ఏపీ నుండి శ్రీశైలం వరకు మరియు విజయవాడ మార్గంలో బస్సులను నడుపుతుంది. ఈ మార్గంలో టిఎస్ఆర్టిసి 273 బస్సులు ఎపిఎస్ఆర్టిసి 192 బస్సులు నడపుతాయని ఒప్పందం కుదిరింది. ఎట్టకేలకు ఈ మంకు పట్టు వీడడంతో బస్సులు రోడ్డెక్కాయి. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.