తెలంగాణాకే తలమానికం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ: కేటీఆర్

తెలంగాణ రాష్ట్రానికి మరో వరం దక్కింది. ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ భూమి పూజ జరిగిoది. తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలలో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికంగా ఉండబోతోందని, ఇన్నాళ్లు మెట్రో రైళ్లను కొరియా నుంచి తెచ్చుకుంటున్నామని.. ఇక మీదట తెలంగాణలోనే తయారుకాబోతున్నాయని తెలిపారు. తెలంగాణ స్వయం సంవృద్ధి సాధించిన రాష్ట్రం కావాలని ఆకాంక్షించారు. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించే రైళ్లు అందుబాటులోకి వస్తే పౌరుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం చేయూతనివ్వాలని.. వరంగల్ లోనూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఆవిర్బవించిన తరువాత పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు.