తెలంగాణలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు?

తెలంగాణలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వార్షిక పరీక్షల నిర్వహణ అయోమయంలో పడింది. దీంతో షెడ్యూల్ ప్రకారం మే 1 నుంచి జరగాల్సిన టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అటు సాయంత్రం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశం ఉన్న నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. దాదాపుగా టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. కరోనా ప్రభావం మరో రెండు నెలల వరకు తగ్గే అవకాశాల్లేవని, వచ్చే నాలుగు వారాలు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ చేస్తున్న సూచనలతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో మే 1 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలను వాయిదా వేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఇంటర్ బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు.