భూమన కుటుంబం తిరుపతిని గంజాయి వనంగా మార్చింది

• రౌడీయిజం, కమీషన్ల కక్కుర్తితో తండ్రి, కొడుకులు చెలరేగిపోతున్నారు
• కూటమి ప్రభుత్వం రాగానే స్థానికులకు నెలలో ఒక రోజు స్వామి వారి దర్శనం
• స్వామి వారి ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యం
• తిరుమలలో జరిగిన అవినీతిపైనా విచారణ చేస్తాం
• తిరుపతిలో జరిగిన ఎన్డీయే కూటమి రోడ్డు షోలో మాట్లాడిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు

‘వైసీపీ నాయకుల అరాచకాలు, దాష్టీకాలు తిరుమల క్షేత్ర పవిత్రతను మంటగలిపాయి. స్వామివారికి భక్తులు ఇచ్చిన ఆస్తుల్ని జగన్ అమ్మేయాలని చూశాడు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే సొమ్ముని తమకు కావాల్సిన వారికి జగన్ మళ్లించాడు. కూటమి అధికారంలోకి రాగానే శ్రీవారి ఆస్తులను కాపాడటంపై పూర్తి దృష్టి పెట్టడంతోపాటు టీటీడీలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామ’ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు స్పష్టం చేశారు. శనివారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారితో కలిసి తిరుపతిలో నిర్వహించిన రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ… “ప్రజల ఆస్తులను దోచేయడానికి ప్లాన్ చేసిన జగన్ అండ్ కో … శ్రీవారి ఆస్తులను కూడా కొట్టేయాలని చూస్తున్నారు. స్వామివారికి ఆంధ్ర ప్రదేశ్ , మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. భక్తులు శ్రీవారికి సమర్పించిన ఆ ఆస్తులపై వైసీపీ నాయకుల కన్నుపడింది. నిరర్ధక ఆస్తులు అని చెబుతూ కొట్టేయాలని చూశారు. శ్రీవారికి ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలవా అని మాట్లాడిన నాయకుల వారసుల ఆలోచనలు ఇలా ఉండకపోతే ఇంకెలా ఉంటాయి..?
• స్థానికులకు శ్రీవారి దర్శనం దూరం చేశారు
జిల్లాకు చెందిన ఒక మంత్రి 10 రోజులకు ఒకసారి 25 మందితో దర్శనానికి వెళ్లి దర్శన టికెట్ల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. శ్రీవారి దర్శనాన్ని అమ్ముకునే వైసీపీ వాళ్లు.. స్థానికులకు శ్రీవారి దర్శనం లేకుండా చేశారు. కూటమి రాగానే స్థానికులకు నెలకోసారి స్వామి వారి దర్శనం అవకాశం కల్పిస్తాం. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన పట్టాలపై శ్రీవారి ఫొటో ఉండాలి గానీ జగన్ ఫొటో పెట్టుకోవడం జగన్ ప్రచార పిచ్చికి పరాకాష్ట. టీటీడీలో నందిని నెయ్యి వాడేవారు ఇప్పుడు కమీషన్ల కోసం నందిని ఆపేసి వారికి ఇష్టమైన వాళ్ల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్‌లను ఎగరేశారు.
• కోడి బొచ్చు కూడా వదల్లేదు
శేషాచలంలోని అరుదైన ఎర్రచందనాన్ని వైసీపీ వాళ్లు దోచుకున్నారు. ఎర్రచందనం డాన్ గంగిరెడ్డికి ఎన్నికల్లో పలు సీట్లలో కూటమి అభ్యర్థులను ఓడించే బాధ్యతను అప్పగించారు. తిరుపతిలో ఏ పని జరగాలన్న కరుణాకర్ రెడ్డికి ఆయన కుమారుడు అభినయ రెడ్డికి కమీషన్ ఇవ్వాలి. కోడి బొచ్చు ద్వారా వీళ్ళిద్దరూ నెలకు లక్షల్లో దోచుకుంటున్నారు. చికెన్ షాప్స్ నిర్వాహకుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. తులసీ వనం లాంటి తిరుపతిని భూమన కుటుంబం గంజాయి వనంలా మార్చేసింది. తిరుపతి గంగమ్మ జాతర కూడా వ్యాపారమైపోయింది. జాతర పేరిట వ్యాపారులను బెదిరించి కోట్లు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వంలో తిరుపతి ప్రజలను దోచిన వారికి సరైన ట్రీట్మెంట్ కచ్చితంగా ఉంటుంది. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం… ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అన్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆరణి శ్రీనివాసులు, తిరుపతి లోక్ సభ స్థానం నుంచి డాక్టర్ వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. వారిని భారీ మెజార్టీతో గెలిపించాల”ని కోరారు.