పెన్షన్ తీసుకునే వారికి కేంద్రం శుభవార్త.. లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువు పొడిగిoపు

కరోనా వైరస్‌ కారణంగా కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌ దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెన్షన్ దారులు తమ లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించేందుకు గడువును డిసెంబర్ 31 వరకూ పెంచుతూ శుక్రవారం ప్రకటన చేసింది కేంద్రం. అందువల్ల “ప్రభుత్వ పెన్షన్ దారులంతా తమ లైఫ్ సర్టిఫికెట్లు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య సమర్పించవచ్చు” అని కేంద్ర వ్యక్తిగత, ప్రజా సమస్యలు, పెన్షన్ల శాఖ మంత్రి జితంద్ర సింగ్ తెలిపారు. అప్పటి వరకూ వారి పెన్షన్‌ పంపిణీకి ఎలాంటి ఢోకా ఉండబోదని పేర్కొన్నారు.

వృద్ధులకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న కారణంగా లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఆయా బ్యాంకులు వీడియో ఆధారిత గుర్తింపు కాల్‌ (వీ సిప్‌) ద్వారా వారిని గుర్తించి పెన్షన్‌ ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వారు నవంబర్ నెలలో కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్‌ను అందించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే ప్రభుత్వం నుంచి పెన్షన్ లభిస్తుంది. అయితే ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం వీరికి ఊరట కలిగించింది. కరోనా వైరస్ నేపథ్యంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును పొడిగించింది.