ముఖ్యమంత్రి బటన్ నొక్కి అంతా బ్రహ్మాండం అంటున్నారు

•ఇంత సంక్షేమం చేసే ప్రభుత్వం దేశంలో లేదంటూ గొప్పలు పోతున్నారు
•అంతా బాగుంటే ఇంత మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు
•రైతులు ఆత్మహత్య చేసుకుంటే కరోనా నెపంతో సమాచారం దాచారు
•బాధ్యత గల ప్రతిపక్షంగా జనసేన ముందుకు వచ్చింది
•20వ తేదీన ఉమ్మడి కడప జిల్లాలో రైతు భరోసా యాత్ర
•175 కౌలు రైతు కుటుంబాల్ని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు
•సిద్ధవటంలో రైతు భరోసా వేదిక ఏర్పాట్లు పరిశీలించిన శ్రీ నాదెండ్ల మనోహర్

బటన్ నొక్కి బ్రహ్మాండంగా సంక్షేమం జరిగిపోతోందని చెబుతూ ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో రైతాంగానికిగానీ, ప్రజలకు గాని భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం పని చేయడం లేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కరోనా నెపంతో ఆ సమాచారం బయటకు రాకుండా దాచిపెట్టారని తెలిపారు. ప్రభుత్వం సరిగా పని చేస్తే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే 175 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడడం దారుణమన్నారు. ఈ నెల 20వ తేదీన ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయం చేసేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించునున్నట్టు తెలిపారు. సిద్ధవటంలో జరిగే సభ ద్వారా రైతు కుటుంబాలకు భరోసా నింపుతారన్నారు. గురువారం మధ్యాహ్నం నాదెండ్ల మనోహర్ కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. రాజంపేట నియోజకవర్గం, సిద్ధవటంలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక ఏర్పాటు తదితర అంశాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ “ముఖ్యమంత్రి, అధికార పార్టీ నేతలు బటన్ నొక్కి అందరి ఖాతాల్లోకి డబ్బు వెళ్లిపోతోంది.. ఇంతకంటే సంక్షేమం చేసే ప్రభుత్వం ఈ దేశంలో లేదని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో రైతాంగానికి భరోసా కల్పించే విధంగా ఎవ్వరూ పని చేయడం లేదు. పాలకులు గాని, యంత్రాంగం గాని ఎవరి పని వారు చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నప్పుడు రైతులకు గిట్టుబాటు వచ్చేలా చేసి, ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పర్యటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రైతాంగాన్ని కులాల వారీగా విడగొట్టడం ఏంటి? రైతుకు కులాలు అంటగట్టడం ఏంటి? నష్టం జరిగితే ఒక ప్రాంతం మొత్తం నష్టం వాటిల్లుతుంది. అన్ని కులాల వారికీ నష్టం జరుగుతుంది. ఈ ప్రభుత్వ తీరు సరికాదు. రైతు భరోసా కేంద్రాల్లో జరిగిన అవినీతి మాములు అవినీతి కాదు. రూ. 6,300 కోట్ల ఖర్చు చేశారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించింది లేదు. పరిహారం ఇచ్చే చోట కూడా సమాజాన్ని విభజించి పాలిస్తున్నారు.
•రైతు కుటుంబాల్లో ధైర్యం నింపే బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నారు
అలాంటి పరిస్థితుల్లో బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా దేశంలో మరే రాజకీయ పార్టీ చేయని విధంగా రైతు భరోసా కార్యక్రమానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ స్పందించి ఈ కార్యక్రమానికి రూ. 5 కోట్ల విరాళం అందించారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. కార్యక్రమం ప్రారంభించినప్పుడు 600 మంది వరకు బాధితులు ఉంటారని భావించాం. ఇక్కడ పరిస్థితి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2900 మంది ప్రాణాలు తీసుకున్నారు. కడప జిల్లాలో సింహభాగం…అంటే 46 మంది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలలో చాలా మందికి ఈ రోజుకీ రూ.7 లక్షల సాయం అందించలేదు. వారి బిడ్డలు చదువుకునే పరిస్థితి లేదు. ఆ బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 607 మందికి జనసేన పార్టీ తరఫున ఆర్ధిక సాయం అందచేశాం. జిల్లాల వారిగా వారి బిడ్డలకు చదువులు చెప్పించే విధంగా కార్యచరణ రూపొందిస్తున్నాం. ప్రతి రైతుకీ ఆర్ధిక సాయంతో పాటు ఎలాంటి కష్టం వచ్చినా మీకు మేమున్నామని చెబుతూ ధైర్యం నింపే కార్యక్రమం ఇది.
•ఎన్నికల మేనిఫెస్టోలతో సరిపెట్టే పార్టీ కాదు
జనసేన పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రైతాంగానికి భరోసా నింపే ప్రభుత్వంగా ఉండేవిధంగా ఆలోచన చేస్తుంది. క్షేత్ర స్థాయిలో రైతులు ఆనందించే విధంగా కార్యక్రమాలు చేపడతాం. కాలువలకు మరమ్మత్తులు చేపడతాం. గతంలో మదనపల్లిలో టమాటా రైతుకు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి అండగా నిలిచారు. ధాన్యం బకాయిలు పేరుకుపోయినప్పుడు మండపేట, కాకినాడల్లో రైతులకు అండగా కార్యక్రమాలు చేపట్టాం. నివర్ తుఫానుతో రైతాంగం నష్టపోతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎకరాకి రూ. 25 వేల ఆర్ధిక సాయం అందించాలని పోరాటం చేశారు. జనసైనికులు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేశారు. రైతాంగం కోసం నిజాయితీగా నిలబడి పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ . జనసేన పార్టీ ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలతో సరిపెట్టే పార్టీ కాదు. రైతు భరోసా యాత్ర కోసం శనివారం ఉదయం కడప విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఒంటి గంటకు సిద్ధవటం చేరుకుని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు” అని చెప్పారు. పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, రాష్ట్ర కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర, సయ్యద్ ముకరం చాంద్, పార్టీ నాయకులు పందిటి మల్హోత్ర, వివేక్ బాబు, వేగుళ్ల లీలా కృష్ణ, శెట్టిబత్తులు రాజబాబు, కళ్యాణం శివ శ్రీనివాస్, ఎం.వి.రావు తదితరులు మనోహర్ గారితో పాటు ఏర్పాట్లు పర్యవేక్షించిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *