వసంత కాలనీలో కాలువల నిర్మాణం చేపట్టాలని జనసేన వినతి పత్రం

  • వసంత కాలనీలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ..
  • కాలువల నిర్మాణం వెంటనే చేపట్టాలి: జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నాయిని సతీష్

కంచికచర్ల: వసంత కాలనీ ఏర్పడి మూడు దశాబ్దాలకు పైగా కాలం గడిచినప్పటికి అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉందని కంచికచర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నాయిని సతీష్ పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు చెబుతున్న అభివృద్ధి ఈ ప్రాంతంలో ఏ చోట కనిపించడం లేదని గడపగడపకు తిరిగిన శాసనసభ్యునికి ప్రతి ఒక్కరు డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపాలని కోరినప్పటికీ ఇప్పటికీ ఒక్క అడుగు కూడా సమస్య ముందుకు కదలలేదని ఆయన విమర్శించారు. సోమవారం స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వసంత కాలనీలోని డ్రైనేజీ వ్యవస్థపై వసంత కాలనీ ప్రాంత ప్రజలు మురుగునీటితో పాములు, విషకీటకాలతో పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తూ ఆపార్టీ కార్యకర్తలతో కలిసి తహసిల్దార్ వి రాజకుమారికి వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఒకవైపు అపారిశుద్ధ్యం, మరోవైపు అభివృద్ధి లేమి వసంతకాలనీ ప్రాంత ప్రజలను కుంగదీస్తోందని అన్నారు. కాలువల నిర్మాణంపై అధికారులు, ప్రజాతినిధులు దృష్టి పెట్టిన దాఖలాలు లేవని ఏళ్లనాటి కిందట నిర్మించిన రహదారులు శిథిల స్థితికి చేరుకున్నాయని అన్నారు. వసంత కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని కాలువల్లో మురుగునీరు రోడ్డుపైకి చేరుతోందని అన్నారు. మరోవైపు మురుగు ఇళ్ల ముందు పారుతుండటంతో దోమల బెడద పెరిగిందని కాలనీలో చిన్నారులు వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. ఇళ్ళ మధ్య చేరిన మురుగునీరు కారణంగా స్థానికులు ఒకరికొకరు ఘర్షణలు పడిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. కాలువల నిర్మాణం చేపట్టక నేటిపారుదలలేని పరిస్థితిలో వర్షాకాలం వచ్చిందంటే కాలనీవాసులు ఎదుర్కొనే అవస్థలు అన్నీ ఇన్ని కావని రోడ్లపై మోకాళ్ళ లోతు నీరు చేరిపోతుందని నివాస గ్రహాలలోకి మురుగునీరు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న వర్షాకాలం లోపు వసంత కాలనీ ప్రాంతంలో కాలువల నిర్మాణం చేపట్టాలని స్పందన కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్నవరం వార్డ్ మెంబరు పసుపులేటి శ్రీను, గోపిశెట్టి నాగలక్ష్మి, తోట ఓంకార్, జెర్రిపోతుల చంటిబాబు, పుప్పల వేణుగోపాల్, కంభంపాటి తిరుమలరావు, పెద్దినేడి హరిబాబు, దేవిరెడ్డి అజయ్ బాబు, కుర్రా నాని, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.