హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ, కిష్కింధ సంస్థానాల మధ్య ప్రారంభమైన చర్చ!

కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తి భావంతో కొలిచే ఆంజనేయస్వామి జన్మస్థలంపై కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఏడుకొండలలో ఒకటైన అంజనాద్రే హనుమంతుడి జన్మస్థానమని ఇటీవల టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై కర్ణాటకలోని కిష్కింధ సంస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

కిష్కింధనే హనుమంతుడి జన్మస్థానమని ఆ సంస్థానం వాదిస్తోంది. టీటీడీ ప్రకటనను ఖండిస్తూ పలు లేఖలు కూడా రాసింది. దీంతో, ఇరు వర్గాలు ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధమయ్యాయి. ఎవరి వాదనను వారు వినిపించేందుకు ఇరువురూ సిద్ధపడ్డారు.

ఈ నేపథ్యంలో తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత పీఠాన్ని ఇరు వర్గాల సంవాదానికి వేదికగా ఖరారు చేశారు. ఈ ఉదయం 10 గంటలకు ఇరు వర్గాలకు మధ్య వాదన ప్రారంభమైంది. కిష్కింద ట్రస్ట్ తరపున గోవిందానంద సరస్వతి… టీటీడీ తరపున కమిటీ కన్వీనర్, సభ్యులు చర్చలో పాల్గొంటున్నారు. చర్చ పూర్తయిన తర్వాత వీరు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.