జూలై 5న అమెజాన్‌ సీఈఓ పదవి తప్పుకోనున్న జెఫ్‌ బెజోస్‌

వాషింగ్టన్‌: అమెజాన్‌ సీఈఓగా పదవి నుంచి జెఫ్‌ బెజోస్‌ తప్పుకోనున్నారు. జూలై 5 నుంచి బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. బుధవారం జరిగిన అమెజాన్ షేర్ హోల్డర్స్ మీటింగ్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘ఆ రోజుకు సరిగ్గా 27 ఏళ్ల క్రితం.. అంటే 1994లో అమెజాన్ సంస్థ ప్రారంభమైంది. అందుకే జూలై 5 నాకు ఎంతో ప్రత్యేకమైంది’ అని తెలిపారు. అయితే, కొత్త సీఈవో ఏ రోజున బాధ్యతలు చేపడతారన్న వివరాలు మాత్రం చెప్పలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించినా.. తేదీని మాత్రం వెల్లడించలేదు.

బెజోస్‌ స్థానంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జెస్సీ తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపడుతారని అమెజాన్‌ ప్రకటించింది. బెజోస్‌ సీఈఓ పదవి నుంచి వైదొలగినా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగనున్నారు. అమెజాన్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేస్‌షిప్, అమెజాన్ డే1 ఫండ్2పై మరింత దృష్టి సారించేందుకే సీఈఓ పదవి నుంచి ఆయన వైదొలగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బుధవారం అమెజాన్‌ కీలక ప్రకటన చేసింది. హాలీవుడ్‌ స్టూడియో ఎంజీఎంను 8.34 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. మరిన్ని షోలు, సినిమాలతో వీడియో స్ట్రీమింగ్ సర్వీస్‌ను యూజర్లకు అందజేస్తామని పేర్కొంది.