వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం

• ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెబుతారు
• ద్వారంపూడి ప్రగల్భాలు మాని.. కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి

రాజకీయాల్లో మనందరం గౌరవించాల్సింది ప్రజాస్వామ్యాన్ని…. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా వైసీపీ పాలన సాగుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నాం ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటే పొరపాటే. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ప్రజలే తమ ఓటుతో బుద్ధి చెబుతారు. వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా మళ్లీ అధికారంలోకి రాదు. ఫలితాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉండేది ఖాయం.
* మీ అహంకారానికి అదే నిదర్శనం
కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడింది చూశాను. ఆయన మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇంత అహంకారం ఎక్కడ నుంచి వచ్చిందో అర్ధం కావడం లేదు. ఆయన పెద్దఎత్తున ప్రగల్భాలు పలుకుతున్నారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా అనవసరంగా ఇలాంటి సమస్యలే సృష్టించారు. మా నాయకత్వాన్ని చులకన చేసే విధంగా మాట్లాడితే సహించేది లేదు. మీరు ఒక శాసనసభ్యుడిగా సమయం వృధా చేసుకోకుండా… కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. పేదలకు ఇస్తామన్న ఇళ్ల పట్టాలపై మాట్లాడండి. డంపింగ్ యార్డుల్లా మారిన మత్స్యకార గ్రామాల గురించి మాట్లాడండి. పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై మాట్లాడండి. బలవంతంగా చెత్త పన్ను వసూలు చేయడానికి బ్యానర్లు కట్టుకొని తిరిగారే…. అదే మీ అహంకారానికి నిదర్శనం.
* శశిధర్ చేతిలో ద్వారంపూడి ఓటమి తప్పదు
ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదే. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైసీపీకి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలే బుద్ధి చెబుతారు. దయచేసి ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు మానుకొని, కాకినాడ అభివృద్ధికి సమయం కేటాయిస్తే ప్రజలు కొంతవరకైనా హర్షిస్తారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ద్వారంపూడి గెలిచే పరిస్థితే లేదు. ఆయనపై ముత్తా శశిథర్ గారు ఘన విజయం సాధించి తీరుతారు. మా నాయకులు ఇప్పటికే ఆ ప్రాంతంలో బలంగా పనిచేస్తున్నారు. గతంలో మా వీర మహిళలను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాయపరిచారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వాళ్లే ఇంటింటికి వెళ్లి ప్రజల ద్వారా సరైన గుణపాఠం చెబుతారు అని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.