4నెలల్లోనే 30వేల కోట్లు దానం చేసిన అమెజాన్ సీఈవో మాజీ భార్య

అపర కుబేరుడు అమెజాన్ సీఈవో జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య మెకంజీ స్కాట్‌ తన దాతృత్వంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. తన సంపదను విరాళాల రూపంలో ఇచ్చేస్తున్నారు. గడిచిన నాలుగు నెలల్లో 4 బిలియన్ డాలర్లకు మించి (రూపాయిల్లో 29,426 కోట్లు) దానం చేశారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో 18వ స్థానంలో ఉన్న మెకంజీ తన ఆస్తిలోని సుమారు 420 కోట్ల డాలర్లను పలు ఛారిటీ సంస్థలకు విడుదల చేశారు.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మహిళల్లో మెకంజీ స్కాట్‌ అగ్రస్థానంలో ఉన్నారు. అయితే.. సంపదను మరింత పెంచుకునేందుకు కాక, దానధర్మాలకు ఖర్చు పెట్టాలని ఆమె నిర్ణయించుకోవడం విశేషం. కరోనా కారణంగా దెబ్బతిన్న కోట్లాదిమంది జీవితాలను ఆదుకునేందుకు వందలాది స్వచ్ఛంద సంస్థలకు ఆమె తన సం పదను దానం చేస్తున్నారు. వీటి గురించి స్వయంగా ఆమెనే ప్రకటించారు.

”అమెరికన్ల జీవితాల్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఇదే సమయంలో కోటీశ్వరుల సంపద 80% మేర పెరిగింది. అందుకే ప్రజలకు సాయంగా నిలుస్తున్న 384 స్వచ్ఛంద సంస్థల్ని గుర్తించి, ఆర్థికసాయం అందిస్తున్నా. ఆకలిని, పేదరికాన్ని దూరం చేసేందుకే ఈ ప్రయత్నం” అని మెకంజీ పేర్కొన్నారు.

విడాకుల సమయంలో బెజోస్‌ ఆమెకు అమెజాన్‌లో 4శాతం వాటాను భరణంగా ఇచ్చారు. కాగా, ఈ ఏడాదిలో మెకంజీ సంపద సుమారు 24 బిలియన్ల డాలర్లు పెరిగింది. ఇందుకు కారణం మెకంజీ ఆస్తులన్నీ.. అమెజాన్ డాట్‌కామ్‌తో లింక్ అయి ఉండడమే. కరోనా ప్రభావం వల్ల ఆ సంస్థ షేర్లు ఇటీవల శాతం పెరిగిన విషయం తెలిసిందే. మహమ్మారి వల్ల ఎక్కువ మంది ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుండడంతోఅమెజాన్ షేర్ల విలువ శరవేగంగా పెరుగుతోంది.