పేర్ని నానితో సినీ నిర్మాతలు మరోసారి భేటీ

ఏపీ మంత్రి పేర్ని నానితో తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులు సమావేశమయ్యారు. సచివాలయంలో నిర్మాతలు దిల్‌ రాజు, బన్నీ వాసు, వంశీ, పంపిణీదారు అలంకార్‌ ప్రసాద్‌ మంత్రితో భేటీ అయ్యారు. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై మంత్రితో వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాలకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అంశంపై సినీ ప్రతినిధుల బృందం చర్చలు జరిపినట్టు సమాచారం. టికెట్ల జారీకి సంబంధించిన సాంకేతిక అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. మరోవైపు కొవిడ్ సమయంలో సినిమా థియేటర్లకు ప్రభుత్వం కల్పించిన విద్యుత్ ఫిక్స్‌డ్‌ ఛార్జీల వెసులుబాటు అంశాన్ని పరిశీలించాల్సిందిగా సినీ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రభుత్వం కోరిన అదనపు వివరాలను తెలియజేసేందుకు మాత్రమే తాము వచ్చినట్లు నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు.