జనసేన కౌలు రైతు భరోసా సభకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తోంది

•పర్చూరు సభకు వెళ్తే అరెస్టు చేస్తామని నోటీసులు ఇస్తున్నారు
•పర్చూరు సభకు కడప జిల్లాలో పోలీసుల నోటీసులు
•అధికారులు అతి చేస్తే హైకోర్టు చీఫ్ జస్టిస్ కి ఫిర్యాదు చేస్తాం
•సోమవారం స్పెషల్ మెన్షన్ పిటిషన్ వేస్తాం
•ప్రభుత్వ చర్యల్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది
•ప్రజాస్వామ్యంలో అందరికీ కార్యక్రమాలు నిర్వహించుకునే హక్కుంది
•సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంటే కడుపుమంట ఎందుకు?
• పవన్ కళ్యాణ్ రైతు కుటుంబాలను ఆదుకుంటుంటే సీఎం నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు
•ప్రకాశం జిల్లా కొత్తపల్లిలో మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

ప్రభుత్వం నుంచి రాష్ట్ర రైతాంగానికి సాయం అందక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జిల్లాల్లో పర్యటించి రైతు కుటుంబాలను ఆదుకుంటుంటే ముఖ్యమంత్రి తట్టుకోలేకపోతున్నారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రైతు భరోసా సభకు వెళ్తే అరెస్టు చేస్తామని మా వీర మహిళలకు, కార్యకర్తలకు నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం నిర్వహించే రైతు భరోసా సభకు వెళ్లకూడదని కడప జిల్లాలో పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ పార్టీగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసే బాధ్యత, హక్కు మాకు ఉన్నాయని, జనసేన పార్టీ కార్యక్రమాల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం సిగ్గు చేటన్నారు. అధికారులు అతిగా స్పందిస్తే మా కార్యకర్తల్ని అడ్డుకోవాలని చూస్తే సోమవారం స్పెషల్ మెన్షన్ పిటిషన్ ద్వారా విషయాన్ని గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. శనివారం ప్రకాశం జిల్లా, సంత నూతన కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ కార్యకర్త అంగలకుర్తి సుమంత్ కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ తరఫున రూ. 2 లక్షల ఆర్ధిక సాయం అందచేశారు. అనంతరం నాదెండ్ల మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ “రేపు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర చేపడతారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి రూ. 5 కోట్లు పార్టీకి విరాళం ఇచ్చి ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలా ఆత్మహత్యకు పాల్పడిన 80 కుటుంబాలకు పవన్ కళ్యాణ్ గారు రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందచేస్తారు. కొంత మందికి ఇళ్లకు వెళ్లి ఆర్ధిక సాయం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా యాత్ర చేస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగడుతుంటే, ముఖ్యమంత్రి అనంతపురం సభలో ఆ కుటుంబాలను అవమానపర్చే విధంగా వ్యాఖ్యలు చేశారు. అందుకు జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికాం. రైతాంగం పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా పర్చూరు సభకు హాజరై రైతుల కష్టాలు, కన్నీరు స్వయంగా చూడాలని సూచించాం. మాట్లాడితే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల రికార్డులు సరిగా లేవు కాబట్టి సాయం చేయలేదు అంటూ అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏడు లక్షల రూపాయలు ఆర్ధిక సాయం చేస్తానని ఆయన ఇచ్చిన హామీ ఏమయ్యింది? శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే రాత్రికి రాత్రి కొంత మందికి రూ. లక్ష, కొంత మందికి రూ. రెండు లక్షలు ఎందుకు వేస్తున్నారు?
•పర్చూరు సభకు వెళ్లొద్దని కడప జిల్లాలో నోటీసులా..?
ఇంకా ఈ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన మా పార్టీ వీర మహిళ పర్చూరు సభకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. పర్చూరు సభకు వెళ్తే అరెస్టు చేస్తామని బెదిరించారు. ఇంత కంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఉంటుందా? ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ వస్తుంటే ఈ ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అధికారులతో ఇటువంటి కార్యక్రమాలు చేయించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తవానికి నోటీసులు అందుకున్న ఆమె సొంత ఊరు కూడా పర్చూరుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. సొంత ఊరికి వెళ్లి కార్యక్రమాన్ని చూసిరావచ్చని భావిస్తే ఆ సమాచారం తెలుసుకుని అక్కడున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి పర్చూరు మీటింగ్ కి వెళ్తే అరెస్టు చేస్తామంటున్నారు. జనసేన పార్టీ తరఫున శ్రీ జగన్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ఎందుకింత ధైర్యం కోల్పోతున్నారు. ఎందుకు ఇంత అభద్రతా భావం. రాష్ట్ర స్థాయిలో వేల మంది రైతుల్ని ఆదుకుంటున్న పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల్సింది.. పోయి అవమానపర్చే విధంగా మాట్లాడుతున్నారు. అధికారాన్ని ఉపయోగించుకుని కార్యక్రమం జరగకుండా మీరు చేసే ప్రయత్నాన్ని జనసేన పార్టీ బలంగా తిప్పి కొడుతుంది. అహంకార పూరితంగా సామాన్యులను ఇబ్బందిపెట్టే విధంగా వైసీపీ చేస్తున్న కార్యక్రమాలను ఎదుర్కొంటాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీగా మాకు కార్యక్రమాలు చేసే హక్కు ఉంది. జిల్లాలవారీగా పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తూ రైతుల కుటుంబాలను ఆదుకుంటుంటే అది చూసి ముఖ్యమంత్రి తట్టుకోలేకపోతున్నారు. కడప జిల్లాలో పోలీసుల్ని పంపి మా వీర మహిళలకు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం. ఇది చాలా తప్పు. ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఒకటి గమనించాలి. ఈ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ దృష్టికి పిటిషన్ ద్వారా తీసుకువెళ్తాం. సమాజానికి ఉపయోగపడే విధంగా మా నాయకుడు కార్యక్రమాలు చేస్తుంటే మీకు ఎందుకంత కడుపు మంట. మీ చేతుల్లో ప్రభుత్వం ఉందిగా మీరు ఆ మూడు వేల మంది రైతుల్ని తాడేపల్లి పిలిపించుకుని మీరిస్తానన్న రూ. 7 లక్షల సాయం అందించండి. పవన్ కళ్యాణ్ గారికి జిల్లాలు తిరగాల్సిన అవసరం ఏముంటుంది? మీ పరిపాలన నిజాయితీగా ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు. మీరు ముఖ్యమంత్రిగా విఫలమయ్యారు. పరిపాలనలో విఫలమయ్యారు. కేవలం కేసులు పెట్టి ప్రజల్ని భయపెట్టి పాలన సాగిస్తున్నారు. మా జనసైనికుల్ని, వీర మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిజాయితీగా పని చేసే వ్యక్తి. రేపటి రోజున ఆత్మహత్యకు పాల్పడిన 80 కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం చేయడంతో పాటే బిడ్డల్ని చదివించుకోలేని వారి కోసం మా పార్టీ తరఫున చదివించే ఏర్పాటు చేస్తున్నాం. మేము అంత ఆదర్శంగా పని చేస్తుంటే సభకు వెళ్లవద్దంటూ ఇళ్లకు పోలీసుల్ని పంపడానికి మించి దౌర్భాగ్యం ఏముంటుందని అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ, ఒంగోలు నగర అధ్యక్షులు మలగా రమేష్, పార్టీ నాయకులు బెల్లంకొండ సాయిబాబు, బొటుకు రమేష్ బాబు, కందుకూరి బాబు, రాయపాటి ప్రసాద్, లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
•ప్రమాదంలో మృతి చెందిన జన సైనికుడి కుటుంబానికి అర్థిక సాయం
అంతకు ముందు ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన జనసైనికుడు అంగలకుర్తి సుమంత్ కుటుంబాన్ని నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శ్రీమతి సుకన్యలకు ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అతని కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు. ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మార్చ్ 14న ఇప్పటం వేదికగా జరిగిన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందారు. అతనికి పార్టీ క్రియాశీలక సభ్యత్వం లేకపోవడంతో జిల్లా నాయకులు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తక్షణం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించారు.
•గ్రామ గ్రామాన జనసేన జెండాల రెపరెపలు
కొత్తపల్లి జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి మార్టూరు వద్ద ప్రకాశం జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మార్టూరులో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మద్దిరాల మండలం పెద్దకొత్తపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో స్థానిక జనసేన శ్రేణులు ఏర్పాటు చేసిన పార్టీ జెండా స్థూపాలను మనోహర్ గారు ఆవిష్కరించారు.