జ‌గ‌న్ స‌ర్కార్ కు వారం గ‌డువిచ్చిన హైకోర్టు

జ‌గ‌న్ స‌ర్కార్ పై ఏపీ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిప‌డింది. రెండు వారాల కింద తామిచ్చిన ఆదేశాల‌ను అమ‌లు చేయ‌క‌పోవ‌టంపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ వారం రోజుల గ‌డువు ఇచ్చింది. ఈ వారం రోజుల్లోగా త‌మ ఆదేశాల‌ను పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. లేదంటే కోర్టు ధిక్క‌ర‌ణ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.

అస‌లేం జ‌రిగింది?

ఉపాధి హామీ ప‌నులు చేసిన త‌ర్వాత బిల్లులు చెల్లించ‌టం లేద‌ని కొంద‌రు కోర్టుకెక్కారు. మొత్తం 494 కేసులు న‌మోదు కాగా వెంట‌నే బిల్లులు చెల్లించాల‌ని కోర్టు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయినా ఏపీ ప్ర‌భుత్వం కేవ‌లం 25మందికే బిల్లులు చెల్లించి, మిగిలిన‌వి పెండింగ్ లోనే ఉంచింది. అయితే, కేంద్రం నుండి బిల్లులు రాలేద‌ని అందుకే తాము చెల్లించ‌టం లేద‌ని గ‌తంలో ఏపీ స‌ర్కార్ కోర్టుకు తెలిపింది.

కానీ కేంద్రం స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో తాము రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన అన్ని బిల్లులు చెల్లించామ‌ని, త‌మ వ‌ద్ద పెండింగ్ లో ఎలాంటి బిల్లులు లేవ‌ని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌కాయిల విష‌యంలో బుకాయిస్తుంద‌ని తేట‌తెల్ల‌మైంది.

రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోర్టు… సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. ఇదే చివ‌రి అవ‌కాశం అని, తమ ఆదేశాలు పాటించ‌క‌పోతే కోర్టు ధిక్క‌ర‌ణ చ‌ర్య‌ల‌ను ఎదుర్కొవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది.