పాఠశాలలను పున:ప్రారంచాలని చూస్తోన్న కేరళ ప్రభుత్వం

కేరళలో పాఠశాలలను పున:ప్రారంభించేలా ప్రభుత్వం యోచిస్తోందని గురువారం ఆ రాష్ట్ర విద్యాశాఖామంత్రి వి. శివన్‌కుట్టి వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి రీత్యా స్కూల్స్‌ను ప్రారంభించలేదు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి తెరుచుకుంటున్నాయి. దీనివల్ల విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నిపుణుల కమిటీ నివేదిక… విద్యాశాఖ నివేదికల్ని ముఖ్యమంత్రికి ఇవ్వనుంది. ఈ నివేదికల సూచనల మేరకు ముఖ్యమంత్రితో చర్చించి.. పాఠశాలలను పున:ప్రారంభించాలా..? వద్దా? అనే నిర్ణయం తీసుకోనున్నట్లు విద్యాశాఖామంత్రి తెలిపారు. అయితే స్కూల్స్‌ను తిరిగి తెరవవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారని ఆయన అన్నారు.
కాగా గడచిన 24 గంటల్లో కేరళలో 32,803 కొత్త కరోనా కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 40,57,233 మందికి చేరింది. బుధవారం ఒక్కరోజే 173 మంది వైరస్‌తో మరణించారు.