కోనసీమ అల్లర్లు ప్రభుత్వ సృష్టే

• ఉద్దేశపూర్వకంగానే జనసేన మీద నిందలు
• వైసీపీ విధ్వంస పాలనకు ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతమే ఉదాహరణ
• మంత్రులు నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజలే బుద్ది చెబుతారు
• మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు

కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు స్పష్టం చేశారు. జరిగిన ఘటన మీద విచారణ జరపకుండా ఉద్దేశపూర్వకంగానే హోంమంత్రి జనసేన మీద నిందలు మోపుతున్నారని ఆరోపించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో ఆ పార్టీకి ఎస్సీ, ఎస్టీల మీద ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్ధం అయ్యిందన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతమే వైసీపీ పాలనకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు వైసీపీ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందన్నారు. శుక్రవారం విజయవాడలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. వైసీపీ మూడేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి తన సలహాదారులతో కలసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జిల్లాల విభజన, పేర్లు పెట్టే అంశం కూడా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తెరమీదకు వచ్చినవే. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు కూడా బలమైన రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో తెరమీదకు తెచ్చారు. కాపు సామాజికవర్గం నుంచి వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నప్పుడు అంతా సంయమనం పాటించారు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంతో ఎస్సీల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు కోనసీమ జిల్లా పేరు మార్పు అంశాన్ని తెరమీదకు తెచ్చారు. కులాల మధ్య చిచ్చుపెట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుడ్ని మీ కుటిల రాజకీయాల్లో పావుగా మారుస్తారా? మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే కడప జిల్లాకు ఆయన పేరు పెట్టండి. పులివెందుల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి భీమ్ రావ్ జిల్లాగా నామకరణం చేయండి. కోనసీమ ఘటనకు జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మొదటి నుంచి కులాల ఐక్యత కోరుకునే వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో ఒకటి అదే అంశాన్ని చెబుతోంది. మంత్రులు తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ నే ఫాలో అవుతున్నారు. కోనసీమ ప్రాంతంలో జనసేన బలపడడాన్ని చూసి తట్టుకోలేకే అల్లర్లను మా పార్టీ మీదకు రుద్దాలని చూస్తున్నారు. మీ అరాచకాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. మాజీ మంత్రి కొడాలి నానికి మంత్రి పదవి ఊడినా బుద్ది రాలేదు. నోరు అదుపులో పెట్టుకోకుంటే అందుకు తగ్గ సమాధానం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరెన్ని కుట్రలు చేసినా 2024లో జనసేన పార్టీ అధికారంలోకి రాబోతోందని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని అన్నారు.