‘లవ్ స్టోరీ’ యూనిట్ షూటింగ్ ముగిసే వరకు రామోజీ ఫిలింసిటీలోనే

అక్కినేని వారసుడు నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తున్నాడు. కరోనావైరస్ లేకపోయుంటే ఈ చిత్రం ఇప్పటికే విడుదలై ఉండేది. ఈ లవ్ స్టోరీ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది.

ఈ సినిమా నిర్మాతలు వచ్చేనెల నుండి షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని, ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేక సెట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం, కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తున్న సమయంలో షూటింగ్ తిరిగి ప్రారంభించాలంటే సినిమా వాళ్లు వెనకడుగేస్తున్నారు. కానీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి ఈ లవ్ స్టోరీ యూనిట్ మాత్రం అన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌కి ఆటంకం కలగకుండా ఉండేలా అడుగులు వేస్తున్నారు. లవ్ స్టోరీ మూవీ షూటింగ్ షెడ్యూల్ ముగిసే వరకు తాము ఇంటికి వెళ్ళకుండా రామోజీ ఫిలింసిటీలోనే ఉండి షూటింగ్ పూర్తి చేసుకుంటామని యూనిట్ వర్గాలు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే సినిమా నటీనటులకు, సిబ్బందికి ఏ ఇబ్బంది లేకుండా షూటింగ్ ముగిసే వరకు నిర్మాతలే రామోజీ ఫిలింసిటీలో వసతి ఏర్పాట్లు చేయబోతున్నారట. కేవలం 15 మంది సిబ్బందిని మాత్రమే ఈ సన్నివేశాలను చిత్రీకరించడానికి అనుమతించనున్నారనే టాక్ వినిపిస్తోంది.