అల్లర్ల సూత్రధారి అధికారపక్షమే!

* వైకాపాపై సర్వ‌త్రా అనుమానాలు
* కులాల కుంప‌టి రాజేసే ప్ర‌య‌త్నాలు
* రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే ర‌చ్చ ర‌గిల్చారా?
* వీడియో దృశ్యాలే ప్ర‌త్య‌క్ష సాక్ష్యాలు
* అలజడి సృష్టి వెనుక వైకాపా నేత‌లు!

కోన‌సీమ జిల్లా పేరు మార్చే అంశం నేప‌థ్యంలో అమ‌లాపురంలో చెల‌రేగిన అల్ల‌ర్లు దుర‌దృష్ట‌క‌ర‌మేన‌న‌డంలో సందేహం లేదు…
కానీ వీటి వెనుక ఓ రాజ‌కీయ ఉద్దేశం, ఓ కుట్రపూరిత‌మైన ప్ర‌య‌త్నం ఉంటే మాత్రం అది ఖ‌చ్చితంగా ఖండించాల్సిన అంశ‌మే!
అయితే ఇప్పుడు ఈ ఉద్దేశం, కుట్ర‌లకు సంబంధించిన అనుమానాలే స‌ర్వేస‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
అల్ల‌ర్ల‌కు సంబంధించి సీసీ కెమేరాల్లో నిక్షిప్త‌మైన దృశ్యాలు, వీడియోల ఆధారంగా చూసిన‌ప్పుడు అల్లర్లను రెచ్చ‌గొట్టిన కీల‌క వ్య‌క్తులు కొంద‌రు అధికార పార్టీకి చెందిన వార‌ని తేల‌డ‌మే ఈ అనుమానాల‌కు, సందేహాల‌కు ఊత‌మై నిలుస్తోంది.
“ఈ అల్ల‌ర్ల వెనుక ప్ర‌తిప‌క్షాల నేత‌లు ఉన్నారు. వాళ్లే త‌మ అనుచ‌రుల‌ ద్వారా ఉద్దేశ‌పూర్వ‌కంగా దాడులు చేయించ‌డానికి ప్ర‌య‌త్నించారు…” అంటూ అధికార వైకాపాకి చెందిన మంత్రులు, నేత‌లు ప‌దే ప‌దే చేసిన ఆరోప‌ణ‌లే నిజ‌మైతే… మ‌రి నిందితుల‌లో వైకాపా పార్టీ వాళ్లు ఎందుకున్నారు?
ఇప్పుడు ఇదే అత్యంత కీల‌క‌మైన ప్ర‌శ్న‌గా మారింది.
పోలీసులు త‌మ విధినిర్వ‌హ‌ణ‌లో భాగంగా సీసీ కెమేరాల‌ను, ఇత‌ర వీడియోల‌ను ప‌రిశీలించి అల్ల‌ర్ల‌కు పాల్ప‌డిన ప‌లువురిని గుర్తించారు. తొలిగా న‌మోదు చేసిన ఎఫ్ఐఆర్ లో అధికులు వైకాపాకు చెందిన వారే కావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.
నిజంగా మంత్రులు చెబుతున్న‌ట్టు ఇదంతా ప్ర‌తిప‌క్షాల కుట్రే అనుకుంటే… అధికార వైకాపా వ్య‌క్తుల పేర్లు బ‌య‌ట‌కి వ‌చ్చే అవ‌కాశ‌మే ఉండ‌దు. వారికి సంబంధించిన దృశ్యాలు కూడా న‌మోద‌య్యే వీలే ఉండ‌దు. నిందితుల‌లో ఇత‌ర పార్టీల‌కు చెందిన వారెవ‌రైనా ఉండ‌వ‌చ్చు కానీ, వైకాపా అనుచ‌రులు మాత్రం ఉండే అవ‌కాశం లేదు.
అమ‌లాపురంలో అనూహ్యంగా చెల‌రేగిన విధ్యంస కాండ‌లో కోట్లాది రూపాయ‌ల మేర‌కు ఆస్తి న‌ష్టం జ‌రిగింది. కొన్ని గంటల పాటు ఏం జ‌రుగుతోందో తెలియ‌నంత రీతిలో భ‌యాందోళ‌న‌ల్లో ప్ర‌జ‌లు చిక్కుకున్నారు. చాలా మంది గాయ‌ప‌డ్డారు. ఈ అల్ల‌ర్లు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన వారుగా పోలీసులు ప్రాధ‌మికంగా 46 మందిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌గా వారిలో 14 మంది వైకాపా వాళ్లే కావ‌డం ఇప్పుడు అంద‌రిలోనూ అనేక ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతోంది.
మ‌రో వైపు ఈ విధ్వంసానికి సంబంధించి ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన వారు కొంద‌రు నాలుగు రోజులుగా వైకాపా బీసీ కౌన్సిల‌ర్‌తో సంప్ర‌దింపులు జరిపార‌ని మంత్రి విశ్వ‌రూప్ చెప్ప‌డం కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక‌వేళ అదే నిజ‌మైతే ఆ సంప్ర‌దింపుల విషయం వైకాపా అధినేత‌ల‌కు ఎందుకు తెలియ‌లేదు? ఆ దశ‌లోనే దిద్దుబాటు చ‌ర్చ‌లు ఎందుకు చేపట్ట‌లేదు? ఇలాంటి జ‌వాబులేని ప్ర‌శ్న‌లెన్నో అనేక మందిలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
అమ‌లాపురం న‌ల్ల వంతెన ద‌గ్గ‌ర వ‌జ్ర వాహ‌నంపై కొంద‌రు రాళ్లు రువ్విన సంఘ‌ట‌న‌పై ఆ వాహనం డ్రైవ‌ర్ వాసంశెట్టి సుబ్ర‌హ్మ‌ణ్యం అమ‌లాపురం ప‌ట్ట‌ణ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ద‌ర్యాప్తు జ‌రిపి ప్రాథ‌మికంగా గుర్తించిన 46 మందిలో వైకాపా కార్య‌క‌ర్త అన్యం సాయి, ఈద‌ర‌ప‌ల్లి వైకాపా ఎంపీటీసీ స‌భ్యుడు అడ‌పా స‌త్తిబాబులో పాటు అధికార పార్టీకి చెందిన 14 మంది ఉన్న‌ట్లు స‌మాచారం.
మ‌రి… ఈ అల్ల‌ర్ల వెనుక ప్ర‌తిప‌క్షాల వ్యూహ‌మే ఉంటే… వైకాపా నాయ‌కుల పేర్లు, దృశ్య‌లు ఎలా వ‌చ్చిన‌ట్టు?
ఈ నేప‌థ్యంలో చూసిన‌ప్పుడు బాధ్య‌త క‌లిగిన మంత్రుల ప్ర‌క‌ట‌న‌లు అస‌త్య ప్ర‌చారాల‌ని ఏ మాత్రం ఇంగితం ఉన్న‌వారికైనా స్ప‌ష్టంగా అవ‌గ‌త‌మ‌వుతుంది. పోలీసుల ప్రాధ‌మిక స‌మాచార‌మైనా అంద‌కుండా, నిజానిజాలేంటో నిర్దరించుకోకుండా హ‌డావుడిగా వైకాపా మంత్రులు, కీల‌క నేత‌లు వేర్వేరు చోట్ల విలేక‌రుల స‌మావేశాలు పెట్టి మ‌రీ ప్ర‌తిప‌క్షాల కుట్రంటూ ఎందుకు ఊద‌ర‌గొట్టిన‌ట్టు?
ఇప్పుడు ఇదే అధికార పార్టీ రాజ‌కీయ ఉద్దేశాలపై అనేక ఆరోప‌ణ‌ల‌కు, విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది.
అన్నింటిక‌న్నా ప్ర‌ధానమైన ప్ర‌శ్న ఏమిటంటే… అస‌లు అమ‌లాపురంలో ఇలాంటి అల్ల‌ర్లు జ‌రిగితే ఎవ‌రికి లాభం? అనేదే!
ఈ ప్ర‌శ్న వేసుకుని ప‌రిస్థితుల‌ను విశ్లేషిస్తే… 151 మంది ఎమ్మెల్యేల‌తో తిరుగులేని మెజార్టీతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారం చెలాయిస్తున్న నేప‌థ్యంలో ఇలాంటి అల్లర్లు చేయించ‌డం వ‌ల్ల ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌త్యేకించి ఎలాంటి రాజ‌కీయ ల‌బ్ది చేకూరే అవ‌కాశం లేదని సామాన్యుల‌కు కూడా ఇట్టే అర్థ‌మ‌వుతుంది.
*ఇవిగివిగో అనుమానాలు…
పాల‌నా విధానాల్లో లోపాలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఉన్న‌ప్పుడు…
పాల‌క‌ పార్టీ ప‌ట్ల వ్య‌తిరేక‌త బాహాటంగానే వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్పుడు…
స‌మాజంలో ప్ర‌జ‌లంద‌రూ పార్టీలు, కుల మ‌త వ‌ర్గాల‌కు అతీతంగా సంఘ‌టితంగా ఆలోచిస్తున్న‌ప్పుడే…నిజానికి ప్ర‌తిప‌క్షాలకు బ‌లం చేకూరుతుంది. ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం సాధ్య‌మవుతుంది.
చాలా సులువుగా అర్థ‌మ‌య్యే ఈ అంశం నేపథ్యంలో ప్ర‌జ‌లు కులాల వారీగా విడిపోతే ఎవ‌రికి లాభం? అని ఆలోచిస్తే స‌మాధానం తేలిగ్గానే దొరుకుతుంది.
ప్ర‌జ‌లు విస్తృత‌మైన‌ ప్ర‌యోజ‌నాల గురించి కాకుండా, సంకుచిత‌మైన కులాల వారీగా ఆలోచించడం మొద‌లు పెట్టిన‌ప్పుడే… పాల‌కుల అవ‌క‌త‌వక‌ల‌పై వ్య‌తిరేక‌త మ‌స‌క‌బారుతుంద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్య‌మే.
ఇప్పుడు కోనసీమ‌లో జ‌రిగిందిదే. సున్నిత‌మైన‌ మ‌నోభావాలతో ముడిప‌డిన ఈ అంశం ఇప్పుడు ఒక్క‌సారిగా ప్ర‌జ‌ల దృష్టిని జ‌గ‌న్‌ ప్ర‌భుత్వంపై పెల్లుబుకుతున్న వ్య‌తిరేక‌త నుంచి… కేవ‌లం కోన‌సీమ జిల్లా పేరు మీద‌కు మ‌ళ్లించింది.
దీన్ని గ‌మ‌నిస్తే అమ‌లాపురంలో చెల‌రేగిన అల్లర్లు ఎవ‌రికి ప‌రోక్షంగా ల‌బ్ధి చేకూరుస్తాయో సులువుగా స్ఫురిస్తుంది.
ఈ నిజాల వెలుగులో ప‌రిశీలించిన‌ప్పుడు అల్ల‌ర్ల వెనుక ఎవ‌రు ఉన్నార‌నేది ఎవ‌రికైనా అర్థమవుతుంది.
ఇందుకు ఊతంగా నిలిచే ఎన్నో అనుమానాలు అనేక ప్ర‌శ్న‌ల‌ను రేకెత్తిస్తున్నాయి.
* కోన‌సీమ జిల్లా పేరును డాక్ట‌ర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా పెట్టాల‌నుకున్న‌ప్పుడు ఆ విష‌యాన్ని మిగ‌తా జిల్లాల విషయంలో అనుస‌రించిన‌ట్టుగా నోటిషికేషన్ స‌మ‌యంలోనే ఎందుకు నిర్ణ‌యించ‌లేదు?
* కొన్ని జిల్లాల పేర్ల‌ను మార్చిన‌ట్టు కోన‌సీమ జిల్లా పేరును కూడా మార్చ‌కుండా, ముందుగా ప్ర‌క‌ట‌న జారీ చేసి నెల రోజుల లోగా అభ్యంతరాలు ఉంటే చెప్ప‌మ‌నే విధానాన్ని ఎందుకు తెర‌పైకి తెచ్చిన‌ట్లు?
* క‌డ‌ప జిల్లాకు వైఎస్ఆర్ పేరు, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే స‌మ‌యంలో ఏక‌ప‌క్ష నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం అంబేద్క‌ర్ పేరు విష‌యంలో రెండోసారి ఆలోచ‌న చేయాల్సిన అవ‌సరం ఎందుకొచ్చినట్టు?
* ఎక్క‌డ ఎలాంటి చిన్న‌పాటి నిరస‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌ర‌గ‌బోతున్నా ముందుగానే అప్ర‌మ‌త్త‌మై, వంద‌లాదిగా మోహ‌రించే పోలీసులు… అమ‌లాపురంలో ప‌రిస్థితి చేజారిపోయేంత వ‌ర‌కు ఎందుకు ఉదాసీనంగా ఊరుకున్న‌ట్లు?
ఈ ప్రశ్న‌లు లేవ‌నెత్తే అనుమానాల నేప‌థ్యంలో చూస్తే అల్ల‌ర్లు ఎవ‌రికి ఎందుకు లాభ‌దాయక‌మో తెలియ‌క‌నే తెలుస్తుంది.
*ఎందుకంటే…
* ఈమ‌ధ్య స‌మాజంలో వెనుక బ‌డిన వ‌ర్గాల వారిపై వైకాపా నాయ‌కుల వ‌ర‌స దాడులు జ‌రిగాయి. తాజాగా ఎమ్మెల్సీ అనంత‌బాబు తన డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యంను హ‌త్య చేసిన సంఘ‌ట‌న పాల‌క పార్టీకి ద‌ళిత వ‌ర్గాల వారిని దూరం చేసింది.
* గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో వైకాపా మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను, నేత‌ల‌ను సామాన్య ప్ర‌జ‌లు బాహాటంగానే నిల‌దీసిన సంఘ‌ట‌న‌లు అన్ని చోట్లా జ‌రిగాయి.
* కోన‌సీమ‌లో బ‌ల‌మైన కాపు వ‌ర్గం ప్ర‌జ‌లు, త‌మ వ‌ర్గానికే చెందిన నాయ‌కుడి విధానాల ప‌ట్ల ఆక‌ర్షితుల‌వుతున్నార‌ని ప్ర‌స్పుటంగా సంకేతాలు వెలువ‌డుతున్నాయి.
* ఈ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో కాపు వ‌ర్గాలకు వెనుక బ‌డిన వ‌ర్గాల వారిని దూరం చేయ‌డం రాజ‌కీయంగా అధికార పార్టీకి లాభ‌దాయ‌కం.
ఈ విశ్లేష‌ణ‌ల నేప‌థ్యంలో… అమ‌లాపురం అల్ల‌ర్ల వ‌ల్ల ఏం జ‌రిగిందో కూడా విశ్లేషించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కోన‌సీమ‌లోనే కాదు ఇత‌ర ప్రాంతాల్లో కూడా అంబేద్క‌ర్ పేరు పెట్టడానికి వ్య‌తిరేకంగానే ఈ అల్ల‌ర్లు జ‌రిగాయ‌నే అభిప్రాయం ఏర్ప‌డింది. దీనిని ఉటంకిస్తూ మాల మ‌హానాడు నేత‌లు హైద‌రాబాద్‌లో ట్యాంకుబండ్ లోని అంబేద్క‌ర్ విగ్రహం వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. కోన‌సీమ‌కు అంబేద్క‌ర్ పేరునే కొన‌సాగించాల‌ని, ఇందుకు వ్య‌తిరేకంగా అల్ల‌ర్లు చేసిన‌ వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాల‌ని డిమాండ్ చేశారు.
ఈ ప‌రిస్థితుల‌న్నింటినీ క్రోడీక‌రించి చూసిన‌ప్పుడు అమ‌లాపురం అల్ల‌ర్ల వెనుక అధికార పార్టీ సంకుచిన ప్ర‌ణాళికే ఉంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు, సామాజిక విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.
అంటే… పాల‌కుల వ్య‌తిరేక‌త నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించ‌డానికి కొంద‌రు వైకాపా నేత‌లే ప‌థ‌క ర‌చ‌న చేసి కోన‌సీమ‌లో కులాల చిచ్చు రేకెత్తించారనే సందేహాలు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తామే అల్ల‌ర్ల‌ను రెచ్చ‌గొట్టి… దాన్ని ప్ర‌తిప‌క్షాల పైకి నెట్ట‌డానికి వైకాపా మంత్రులు, నేత‌లు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించార‌నే అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.