పవన్ కళ్యాణ్ – చంద్రబాబు భేటీపై భయం ఎందుకు?

* జగన్ పాలన విముక్తి కోసం విపక్షాల సంప్రదింపులు జరుగుతూనే ఉంటాయి
* రెవెన్యూ మంత్రి వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఏం చెబుతారు?
* పాలన వదిలేసి చవకబారు మాటలు మానండి
* రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయింది
* రాజాంలో మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి నష్టం.. రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం. ఆ నష్టాన్ని నివారించేందుకు విపక్షాల సంప్రదింపులు సాగుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును కలిస్తేనే వైసీపీ నాయకులు ఇంత భయపడటం ఎందుకు? మీకు 151 మంది ఎమ్మెల్యేల బలం ఇచ్చారు. పాలన చేసి, ప్రజల మన్ననలు అందుకోవాల్సిన మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టానుసారం సమావేశాలు పెట్టి వైసీపీ నాయకులు భయపడడం మానండని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ కుటుంబ సభ్యులను, అలాగే గ్రంధి సన్యాసి రాజు గారిని మంగళవారం రాజాంలోని వారి నివాసంలో మనోహర్ ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ “వైసీపీ నాయకులు మొదట పాలన చేయడం నేర్చుకోవాలి. చవకబారు మాటలు, విమర్శలు మాని సుపరిపాలన అందించండి. మీ నాయకుడు 175 సీట్లను గెలుచుకోవాలని చెప్తున్నాడు. దానికి తగినట్లుగా పరిపాలించండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే లక్ష్యంగా మీ చేష్టలు మానుకోండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మార్చి 14వ తేదీన జరిగిన ఇప్పటం సభలోనే విపక్షాల ఓట్లను చీలనివ్వము అని బహిరంగంగా చెప్పారు. ఈ వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడానికి మరిన్ని సంప్రదింపులు ఉంటాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ చంద్రబాబు గారు భేటీపై భయం ఎందుకు? కచ్చితంగా వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయడం కోసం పని చేస్తాం.
* రాష్ట్ర మంత్రి మాటలకు ముఖ్యమంత్రిదే బాధ్యత
రాష్ట్రంలోని మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు. ఒక మంత్రి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే మరొక మంత్రి ఇక్కడి నుంచే పాలన అంటారు. రెవెన్యూ మంత్రి ఏకంగా ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలి అని చెప్తున్నారు. క్యాబినెట్లో ఒక మంత్రి అన్న మాటలకు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. మంత్రి మాటలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఉత్తరాంధ్ర మీద కపట ప్రేమ చూపిస్తున్న వైసీపీ నాయకుల ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారు. కచ్చితంగా వారు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు. మేం ప్రజల పక్షాన మాట్లాడుతాం. రాష్ట్ర ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాని వైపు మాత్రమే జనసేన పార్టీ ఉంటుంది.
* నిరుద్యోగిత రేటు బాగా పెరిగింది
రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు దారుణంగా పెరిగింది. దేశవ్యాప్తంగా సగటున 6 శాతం ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం 9.4 శాతం ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో నాలుగు శాతం మాత్రమే ఉంది. దీనిపైన పాలకులు సమాధానం చెప్పాలి. ఉత్తరాంధ్ర నుంచి వలసలు భారీగా పెరిగిపోతున్నాయి. పొట్ట చేత పట్టుకుని దేశం నలుమూలలకు ఉత్తరాంధ్ర ప్రజలు వెళ్లిపోతున్నారు. గతంలో వచ్చిన పరిశ్రమలకు కొత్త పరిశ్రమలకు ఈ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. మత్స్యకారులు సైతం కుటుంబాలను వదిలి, కేవలం రూ. 12 వేల జీతం కోసం వలసలు వెళ్లిపోతున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం ప్రతి ఏటా రూ.50 కోట్లు ఇస్తామని అప్పట్లో చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కచ్చితంగా ఏటా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. ఈ ప్రాంతాలకు కచ్చితంగా స్పెషల్ గ్రాంట్ అవసరం.
* విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుగా మాట్లాడింది మేమే
బయటికి ఒకటి.. లోపల మరో మాట చెప్పే తత్వం జనసేన పార్టీది కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీదకు వచ్చినప్పుడు నాలుగు రోజుల్లోనే దానిమీద స్పందించింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నాలుగు రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసాం. శ్రీ అమిత్ షా గారితో సమావేశం అయ్యాం. ఆ సమయంలోను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అలాగే ఎన్నో త్యాగాలతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితిలోనూ ప్రైవేటీకరించవద్దని బలంగా కోరాం. దీనిపై మొట్టమొదట స్పందించింది జనసేన పార్టీ మాత్రమే. బీజేపీ పెద్దలను ఎప్పుడు కలిసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాలను చర్చిస్తాం. మాకు ఎలాంటి వ్యక్తిగత అజెండాలు ఉండవు. ఐటీ సెక్టర్ బలోపేతం, పరిశ్రమలు తీసుకురావడం, వలసలు నిరోధించడంపై జనసేన పార్టీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతుంది. కచ్చితంగా ఒక వ్యూహం ప్రకారం ఈ ప్రాంత అభివృద్ధికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. పూర్తి నిబంధనలు పాటించి పోలీసులు చెప్పిన సూచనలు తీసుకొని యువశక్తి సభ విజయవంతం చేస్తాం. ఈ సభ ద్వారా జనసేన భవిష్యత్తు ప్రణాళికలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తారు” అని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, కోన తాతారావు, జనసేన నాయకులు సుందరపు విజయ్ కుమార్, పి.వి.ఎస్.ఎన్.రాజు, రెడ్డి అప్పలనాయుడు, ఎన్ని రాజు తదితరులు పాల్గొన్నారు.