నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

ఈరోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు నుంచి ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 20 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన తరువాత మొదట కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇటీవల తిరుపతి ఉపఎన్నికలో విజయం సాధించిన వైసీపీ అభ్యర్ధి మద్దిల గురుమూర్తితో సహా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం కొత్తగా మంత్రులుగా పదవీబాధ్యతలు స్వీకరించిన మంత్రులను సభకు పరిచయం చేస్తారు.

ఆ తరువాత ఇటీవల మృతి చెందిన 40 మంది మాజీ సభ్యులకు సభ నివాళులు అర్పిస్తుంది. ఈ కార్యక్రమాల అనంతరం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో పెట్రోల్ ధరల పెరుగుదల, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ప్రభుత్వ వైఫల్యాలు, వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనలు వంటి పలు అంశాలపై ప్రతిపక్షాలు ప్రశ్నించనున్నాయి. ఇక ఈ సమావేశాల్లో 17 కొత్త బిల్లులతో పాటు, మరో రెండు ఆర్ధిక బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది. అంతే కాకుండా ఇటీవల జారీ చేసిన మూడు ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇవ్వబోతున్నారు.