నూతన విద్యావిధానం సవాళ్లను అధిగమిస్తుంది

రాబోయే కొత్త శతాబ్దపు క్లిష్టమైన ఉన్నత విద్య అవసరాలు, భవిష్యత్తు సవాళ్లను నూతన విధానం-2020 పరిష్కరించగలదని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి నేతృత్వంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం-2020పై సోమవారం నిర్వహించిన గవర్నర్ల ఆన్‌లైన్‌ సదస్సులో విశ్వభూషణ్‌ ప్రసంగించారు.

నూతన విద్యావిధానాన్ని స్వాగతిస్తున్నానన్నారు. పరిశోధనల్లో నాణ్యత, నవ్యతతో పాటు పేటెంట్‌ ఆధారిత పరిశోధన, మేధో సంపత్తిహక్కులను ప్రోత్సాహించే క్రమంలో జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థతో రాష్ట్ర విశ్వవిద్యాలయాల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. గ్రామీణ, వెనుకబడిన విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్య అవకాశం కల్పించేందుకు పట్టణ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల మధ్య సాంకేతికత అంతరం తగ్గించడానికి ఇ-లెర్నింగ్‌ కమ్యూనిటీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.