పార్వతీపురాన్ని వేధిస్తున్న సమస్యలు పరిష్కరించాలి

  • స్వచ్ఛమైన తాగునీరు పుష్కలంగా అందించాలి
  • చినుకు పడితే చెరువుగా మారుతున్న పట్టణం మెయిన్ రోడ్డులో నూతన కాలువలు ఏర్పాటు చేయాలి
  • డంపింగ్ యార్డ్ తరలించాలి
  • బందిరు దొడ్డి ఏర్పాటు చేసి రోడ్డుపై పశువులను తరలించాలి
  • ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి అని డిమాండ్ చేసిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురాన్ని వేధిస్తున్న సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. బుధవారం ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మున్సిపాలిటీ కుళాయిల్లో ప్రస్తుతం వస్తున్న బురద నీటిని స్వచ్ఛమైన నీరుగా మార్చి, సరిపడా సరఫరా చేయాలని కోరారు. అలాగే ప్రతిరోజు పుష్కలంగా తాగు నీరు సరఫరా చేయాలన్నారు. పనులకు వెళ్లే ప్రజలకు అనుకూలమైన సమయాల్లో కుళాయిలు ఇవ్వాలని అన్నారు అలాగే పట్టణాన్ని వేధిస్తున్న చెత్త డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. మున్సిపాలిటీలో ప్రతిరోజు తయారవుతున్న చెత్త నుండి సంపద తయారు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. పట్టణ మెయిన్ రోడ్ లో విచ్చలవిడిగా తిరుగాడుతూ రోడ్డు ప్రమాదాలు కారణం అవుతున్న పశువులను, బందిరి దొడ్డి ఏర్పాటు చేసి దానికి తరలించాలన్నారు. అలాగే బెలగాము మొదలుకొని పాత బస్టాండ్ రాయగడ రోడ్డు వరకు పట్టణాన్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. మెయిన్ రోడ్ లో ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలన్నారు. బెలగాం నుండి వై.కె.ఎం.కాలనీ వరకు గల మెయిన్ రోడ్ లో సెంటర్ డివైడర్లు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలు నివారించాలన్నారు. పట్టణ చివరి ప్రాంతాల్లో తక్షణమే కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని అంతవరకు పుష్కలంగా ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిదించాలన్నారు. అలాగే ఏమాత్రం వర్షం పడినా ముంపు గురవుతున్న పట్టణ మెయిన్ రోడ్డుతో పాటు లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు పోయేందుకు నూతన కాలువలు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీ చేపలు మాంసపు మార్కెట్ కి రాకపోకలు సాగించేందుకు రహదారితో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో మురుగు కాలువలు రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే వై.కె. ఎం. కాలనీతో పాటు పలు పట్టణ చివరి ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై పాలకుల అధికారులు దృష్టి సారించి సమస్యలు పరిష్కారాన్ని కృషి చేయాలని కోరారు.