రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ.. కార్యాలయాల దగ్గర పండుగ వాతావరణం

తెలంగాణలో ఆన్‌లైన్‌ విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభమైన క్రమంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సందడిగా మారాయి. స్లాట్‌ బుకింగ్‌ల కోసం అమ్మకం కొనుగోలుదారులు క్యూ కట్టారు. అయితే.. మొదట వెబ్‌సైట్‌ ఓపెన్ కావడంలో కాస్త ఇబ్బందులు తలెత్తినా వాటిని వెనువెంటనే తీర్చేలా 100 మంది నిపుణులతో వార్‌రూం ఏర్పాటుచేశారు అధికారులు. సింపుల్‌సిస్టమ్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించామన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులతో భేటీ అయిన సీఎస్‌.. ముందస్తు స్లాట్‌ బుకింగ్‌ కాకుండా రిజిస్ట్రేషన్లు జరగవని చెప్పారు.

ఆన్‌లైన్‌ ద్వారా ఛలాన్‌ తీసుకోవడంతో పాటు పేమెంట్‌ కూడా చేయొచ్చన్నారు. కాగా, ఈ నెల 14 నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. 95 రోజుల తర్వాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ల బుకింగ్‌ను మొదలు పెట్టారు. ఇళ్లు, ఫ్లాట్లతో పాటు ఓపెన్‌ ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. గతంలో 16 లక్షల లావాదేవీల్లో 10 వేలు స్లాట్ బుకింగ్ ద్వారా జరిగేవి. ఇప్పుడు వంద శాతం స్లాట్ బుకింగ్ ద్వారానే జరగనున్నాయి.