అధికార పార్టీ ఇసుక దాహంతోనే గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయాయి

• ఈ విపత్తు ప్రకృతి వల్ల వచ్చిందని చెప్పే నైతికత ఏ అధికార పార్టీ నేతకీ లేదు
• అధికారులు సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయలేదు
• కడప జిల్లా ఎగువ మందపల్లిలో జనసేన పార్టీ మెడికల్ క్యాంప్ ప్రారంభించిన శ్రీ నాదెండ్ల మనోహర్

అధికారంలో ఉన్న వారి ఇసుక దాహం.. విపరీతమైన ధన దాహం కారణంగానే గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కృత్రిమ ఇసుక కొరత తీసుకువచ్చి తద్వారా సృష్టించిన విధ్వంసం పచ్చటి కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు. ఇసుక మాఫియాలో రాజకీయ నాయకుల ప్రమేయం కారణంగా దోపిడి పెరిగిపోయిందన్నారు. అధికార పార్టీకి చెందిన ఏ నాయకుడికీ ఈ విపత్తు ప్రకృతి వల్ల వచ్చిందని చెప్పే నైతిక ధైర్యం లేదన్నారు. బుధవారం అన్నమయ్య డ్యాం కట్ట తెగి వచ్చిన వరదల కారణంగా భారీగా నష్టపోయిన కడప జిల్లా, ఎగువమందపల్లి గ్రామంలో జనసేన పార్టీ డాక్టర్స్ సెల్ ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించారు. మందపల్లి గ్రామంలో వరదలు సృష్టించిన విలయానికి 12 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. ఆ గ్రామంలో పర్యటన సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “అధికారులు ప్రజలకు ఆలస్యంగా సమాచారం అందించారు. రెండు మూడు రోజుల ముందు అప్రమత్తం చేసి ఉంటే ఎవరికి వారు జాగ్రత్త పడేవారు. ఇంత మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చేది కాదు. అక్రమార్జన ధ్యేయంగా రాజకీయ నాయకులు చేసిన పనుల వల్లే ఇలాంటి పరిస్థితులు దాపురించాయి. ప్రజలంతా ఆ విషయాన్ని గమనించాలి. ముఖ్యమంత్రి చిన్న చిన్న ఎలక్షన్ కోసం గ్రామాల్లో, పట్టణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంఛార్జులుగా పెట్టి, మకాం వేయించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మరీ ఓట్లు వేయించుకుంటున్నారు. మరి ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఒక్క మంత్రి కూడా గ్రామాల్లో ఎందుకు మకాం వేయడం లేదు? శాసన సభ్యులు ఎందుకు ఈ ప్రాంతాలకు వచ్చి తిరగడం లేదు. ప్రజలు మంచి ప్రభుత్వం కోసం, పరిపాలన అందిస్తారన్న నమ్మకంతో ఓటు వేశారు. అధికార యంత్రాంగాన్ని చూసి ఓటు వేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వారి వ్యవహార శైలి చూస్తే విచిత్రంగా అనిపిస్తోంది. వారి వ్యాపారం కోసం వేసిన ఎత్తుగడల వల్ల ఇంత నష్టం వాటిల్లింది. సొంత జిల్లాకు ఆపద వస్తే ముఖ్యమంత్రి ఈ రోజు వరకు పర్యటించలేదు. భరోసా కల్పించే నాయకుడి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. మావంతుగా జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మందపల్లి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ డాక్టర్స్ సెల్ ఈ క్యాంపు ఏర్పాటు చేశారు. వైద్య సేవలతో పాటు మందులు కూడా అందించే విధంగా వైద్యులు ముందుకు వచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున నిత్యవసర వస్తువులు, కొంత మొత్తం ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలు చూసి అన్ని జిల్లాల నుంచి మా పార్టీ నాయకులు భరోసా కల్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఎవరి వంతు వారు సాయం పంపుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ తరఫున దాతలందరికీ ధన్యవాదాలు. వరదలు ముంచెత్తిన సమయంలో అర్ధరాత్రి వేళ కూడా యువకులు, జనసైనికులు చాలా మంది ప్రాణాలు కాపాడారు. వారికి అభినందనలు తెలియచేస్తున్నాం. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు చేపట్టింది లేదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ ముకరం చాంద్, శ్రీ సుంకర శ్రీనివాస్, డాక్టర్ బోనాసి వెంకట సుబ్బయ్య, శ్రీ మలిశెట్టి వెంకటరమణ, శ్రీమతి ఆకెపాటి సుభాషిణి, శ్రీ చెంగారి శివప్రసాద్, జనసేన డాక్టర్స్ సెల్ ఛైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు, వైస్ ఛైర్మన్ డాక్టర్ గౌతమ్ రాజ్, డాక్టర్ డి.రెడ్డిప్రసాద్, డాక్టర్ వి.రెడ్డి ప్రసాద్, డాక్టర్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.