అదే నిర్ల‌క్ష్యం… అదే మొద్దునిద్ర‌!

* అచ్యుతాపురంలో మ‌రో సారి గ్యాస్ లీకేజి
* అల్లాడిపోయిన 150 మంది మ‌హిళ‌లు
* రెండు నెల‌ల్లోనే పునరావృత‌మైన విషాదం
* జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఉదాసీన‌తే కార‌ణం
* ప్ర‌జ‌ల భ‌ద్ర‌త ప‌ట్ట‌ని వైకాపా నిర్వాకం

అదే అచ్యుతాపురం…
అదే కంపెనీ…
అదే సంఘ‌ట‌న‌…
అదే ఆవేద‌న‌…
స‌రిగ్గా రెండు నెల‌ల క్రితం జూన్ 3న విష‌వాయువు లీకై 469 మంది మ‌హిళ‌ల ప్రాణాలు గాలిలో కొట్టుమిట్టాడిన దుర్ఘ‌ట‌నను ఇంకా మ‌ర్చిపోకుండానే… తిరిగి ఆగ‌స్టు 2న మ‌ళ్లీ గ్యాస్ లీకై 150 మంది మ‌హిళా కార్మికులు ఆసుప‌త్రి పాల‌వ‌డం అత్యంత విషాద‌క‌రం.
మ‌రి ప్ర‌భుత్వం ఏం చేస్తోంది?
అదే నిర్ల‌క్ష్యం…
అదే ఉదాసీన‌త‌…
అదే మొద్దునిద్ర‌…
అదే బాధ్య‌తారాహిత్యం!
ప్ర‌జ‌ల భ‌ద్ర‌త ప‌ట్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేష్ట‌లుడిగిపోయింద‌న‌డానికి అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం ప్ర‌త్యేక సెజ్‌లోని సీడ్స్ కంపెనీలో రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో రెండుసార్లు జ‌రిగిన గ్యాస్ లీకేజి దుర్ఘ‌ట‌న‌లు ప్ర‌త్య‌క్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
జూన్‌లో జ‌రిగిన ప్ర‌మాదం గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఇంకా నివేదికే వెలువ‌డ‌లేదంటే ప్ర‌భుత్వంలో నిష్క్రియాప‌రత్వం ఎంత లోతుగా వేళ్లూనుకునిపోయిందో అర్థం చేసుకోవ‌చ్చు.
తాజాగా అదే కంపెనీలో జ‌రిగిన విష‌వాయువు లీకేజి వ‌ల్ల 150 మంది మ‌హిళ‌లు ఆసుప్ర‌తుల పాలై అల్లాడుతున్నారు. వారి కుటుంబాలు క‌ల‌వ‌రంతో త‌ల్ల‌డిల్లుతున్నాయి. మ‌రో మూడు గంట‌ల్లో విధులు ముగుస్తాయ‌న‌గా… గాఢ‌మైన విష‌వాయువు విడుద‌లై క‌మ్ముకోవ‌డంతో మ‌హిళా కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. వారిలో చాలా మంది ఊపిరి అంద‌క గిల‌గిల‌లాడుతూ త‌ల‌లు వాల్చేసి స్పృహ త‌ప్పిపోయారు. హుటాహుటిన వారిని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించినా స‌రైన వైద్య సేవ‌లు అంద‌క మ‌హిళ‌లు న‌ర‌కం అనుభ‌వించారు. వారిలో గ‌ర్భిణులు కూడా ఉండ‌డంతో కుటుంబ స‌భ్యుల ఆందోళ‌న‌కు అంతేలేక‌పోయింది.
రాత్రి 7 గంట‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగినా ప్ర‌భుత్వం నిమ్మ‌కునీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించింది. బాధితుల‌కు చికిత్స అందించ‌డానికి ప్ర‌భుత్వ యంత్రాంగం ఒక్క వైద్యుడిని కూడా పంప‌క‌పోవ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు.
అది ప్ర‌మాద‌క‌ర‌మైన ర‌సాయ‌నాల‌తో కూడిన ప‌రిశ్ర‌మ‌లు కేంద్రీకృత‌మైన ప్రాంత‌మ‌ని తెలుసు…
అక్క‌డ త‌ర‌చు గ్యాస్ లీకేజి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలుసు…
కానీ… మ‌రోసారి ఇలాంటి దుర్ఘ‌ట‌న జ‌రిగితే ఎలాంటి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాలో కూడా తెలియ‌నంత నిర్ల‌క్ష్యంగా ప్ర‌భుత్వ యంత్రాంగం వ్య‌వ‌హ‌రిస్తోంది.
ఎలాగంటే… అచ్యుతాపురం ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను సిద్ధంగా ఉంచాల‌న్న ఇంగితం కూడా అధికారులు, వారిని ప‌ర్య‌వేక్షించే నేత‌ల్లో లోపించింది. ఫ‌లితంగా తాజా సంఘ‌ట‌న‌లో ఆసుప‌త్రికి చేరినా కూడా ఆక్సిజ‌న్ అంద‌క బాధిత మ‌హిళ‌లు విల‌విల లాడిపోతూ ప్రాణ భ‌యంతో కేక‌లు వేశారు. ఇలా ఊపిరి అంద‌ని వారిని హ‌డావుడిగా అన‌కాప‌ల్లికి, వేరే ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించాల్సి వ‌చ్చింది.
రెండు నెల‌ల క్రితం జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌పై అన‌కాప‌ల్లి జేసీ క‌ల్ప‌నాకుమారి ఆధ్వ‌ర్యంలో నిపుణుల క‌మిటీ విచార‌ణ చేసినా… ఇప్ప‌టి వ‌ర‌కు విష‌వాయువు ఎక్క‌డ నుంచి లీకైందో ప్ర‌క‌టించ‌లేకపోవ‌డం ప్ర‌భుత్వ ప‌రమైన పెను నిర్లక్ష్యానికి ప్ర‌బ‌ల నిద‌ర్శ‌న‌మ‌నే ఆరోప‌ణ‌లు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి. పైగా ఈ ప్రాంతం రాష్ట్ర పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ సొంత జిల్లాలోనిదే. అయినా మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ కానీ, అధికార యంత్రాగాన్ని అప్ర‌మ‌త్తంగా ఉంచ‌డంకానీ జ‌ర‌గ‌డం లేద‌న‌డానికి రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఒకే కంపెనీలో ఒకే రీతిలో జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌లే ద‌ర్ప‌ణంగా నిలుస్తున్నాయి. రెండు నెల‌ల క్రితం ఇదే మంత్రి గ్యాస్ లీకేజి స్థ‌లానికి అధికారుల‌తో క‌ల‌సి వ‌చ్చి ప‌రిశీలించారు. కమిటీ వేసి హ‌డావుడి చేశారు. అంతే… ఆపై మిన్న‌కుండిపోయారు. లేక‌పోతే ఈ పాటికి అప్ప‌టి ప్ర‌మాదానికి కార‌ణాలేంటో తేలి ఉండేవి. అందుకు అనుగుణంగా త‌గిన చ‌ర్య‌లు తీసుకుని ఉంటే, ఇప్పుడు తాజా దుర్ఘ‌ట‌న జ‌రిగేదే కాదు. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల ప‌ట్ల బాధ్య‌తాయుతంగా ప‌నిచేసే ప్ర‌భుత్వం చేప‌ట్టే క‌నీస చ‌ర్య‌లు. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ప్ర‌చారం మీద ఉన్న శ్ర‌ద్ధ‌, ప‌త్రిక‌ల్లో ఫుల్‌పేజీ ప్ర‌క‌ట‌న‌లు జారీ చేయ‌డంలో ఉన్న ఆస‌క్తి… ప్ర‌జ‌ల ప్రాణాల ప‌ట్ల‌, కార్మికుల సంక్షేమం ప‌ట్ల లేద‌న‌డానికి గ్యాస్ లీకేజి దుర్ఘ‌ట‌న‌లు ప‌దే ప‌దే జ‌ర‌గ‌డ‌మే నిలువెత్తు నిద‌ర్శ‌నం!
* నిద్ర‌పోతున్న నియంత్ర‌ణ…
సాధార‌ణంగా ఓ పారిశ్రామిక సెజ్‌లో అనేక ప‌రిశ్ర‌మ‌లకు అనుమ‌తి ఇస్తారు. ఆయా ప‌రిశ్ర‌మ‌లలో భ‌ద్ర‌తా ఏర్పాట్లు ప‌రిశీలించ‌డానికి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా తీసుకునే చ‌ర్య‌ల‌ను త‌ర‌చు ప‌రిశీలించ‌డానికి, కార్మికుల ర‌క్ష‌ణ విధానాలు స‌క్ర‌మంగా అమ‌లు జ‌రుగుతున్నాయో లేదో త‌ర‌చు త‌నిఖీల ద్వారా క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డానికి, ఏవైనా ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు త‌క్ష‌ణమే స్పందించి త‌గిన చ‌ర్య‌లు తీసుకునే ఏర్పాట్లు ఉన్నాయో లేదో గ‌మ‌నించ‌డానికి, ప్ర‌మాద కార‌ణాల‌ను సాధ్య‌మైనంత తొంద‌ర‌గా క‌నుగొని అప్ప‌టిక‌ప్పుడు స్పందించ‌డానికి, ఇక‌పై ఇలాంటి ప్ర‌మాదాలు త‌లెత్త‌కుండా ప‌క‌డ్పందీగా చెక్‌లిస్ట్ ప‌ద్ధ‌తుల‌ను విధించ‌డానికి వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల యంత్రాంగం స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల్సి ఉంటుంది. కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫ్యాక్ట‌రీస్ అధికారుల బృందం, సంబంధిత మంత్రిత్వ శాఖ‌కు చెందిన అధికార బ‌ల‌గం నిరంత‌ర నియంత్ర‌ణ విధానాల‌తో క‌లిసిక‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. వీరందరిపై పాల‌క వ‌ర్గం నుంచి సంబంధిత మంత్రి, ఆపై ముఖ్య‌మంత్రి త‌ర‌చు స‌మావేశాలు నిర్వహిస్తూ, సూచ‌న‌లు ఇస్తూ ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల్సి ఉంటుంది. అయితే నిర్ల‌క్ష్యం నిలువుగా పేరుకుపోయిన జ‌గ‌న్ ప్రభుత్వంలో ఈ వ్య‌వ‌స్థ‌ల‌న్నీ పెను నిద్ర‌లో జోగుతున్నాయ‌న‌డానికి త‌ర‌చు జ‌రిగే గ్యాస్ లీకేజి దుర్ఘ‌ట‌న‌లను మించిన సాక్ష్యం అక్క‌ర్లేదు.
* గ‌తంలోనూ ఇదే తంతు…
అచ్యుతాపురం సెజ్‌లో దాదాపు 180 వ‌ర‌కు ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు షిఫ్టు ప‌ద్ద‌తిలో నిరంత‌రం ప‌ని చేస్తుంటారు. ఇన్ని ప‌రిశ్ర‌మ‌లు కేంద్రీకృత‌మైన ఇలాంటి ప్రాంతాల్లో ప‌ర్య‌వేక్ష‌ణ కొర‌వ‌డితే ఒకోసారి ఒక చోట త‌లెత్తిన ప్ర‌మాదం ప్ర‌భావం ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌ను సైతం ప్ర‌మాదంలోని నెట్టే అవ‌కాశాల‌ను ఎవ‌రూ కాద‌న‌లేరు. అప్పుడు వేలాది మంది కార్మికుల జీవితాలు గాలిలో దీపంలాగా మారుతాయ‌న‌డంలో సందేహం లేదు.
ఒక‌సారి ఒక పొర‌పాటు జ‌రిగితే అది పున‌రావృతం కాకుండా ప‌టిష్ట‌మైన ప‌ద్ధ‌తుల‌ను ఏర్పాటు చేసుకోవాల‌నేది జ‌గ‌మెరిగిన సూత్రం. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇలాంటి ప‌నితీరే జ‌గ‌న్ ప్రభుత్వంలో కొర‌వ‌డింది. ఒక్కసారి రెండేళ్ల వెన‌క్కి వెళితే… విశాఖ‌ప‌ట్నంలో ఎల్‌జీ పాలిమ‌ర్స్ లో 2020 మే 7న స్టైరీన్ రసాయ‌నం నుంచి వెలువ‌డిన ఆవిర్ల కార‌ణంగా 12 మంది మృత్యువాత ప‌డిన దారుణ ఘ‌ట్టం అంద‌రినీ ఉలిక్కిప‌డేలా చేస్తుంది. వంద‌లాది మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అప్ప‌ట్లో కూడా అనేక మంది కార్మికులు, ప్ర‌జ‌లు సైతం రోడ్ల మీద ఎక్క‌డికక్క‌డ ప‌డిపోవ‌డం తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు దారి తీసింది. ఆ నేప‌థ్యంలో ఓ క‌మిటీ వేసి ప‌రిశ్ర‌మ‌ల్లో ప్ర‌మాదాల నివార‌ణ‌కు తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌ల‌పై సిఫార్సులు చేశారు. అయితే ఆయా సిఫార్సుల‌ను ప‌రిశ్ర‌మ‌ల వాళ్లు పాటిస్తున్నారా, లేదా అనే నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ కొర‌వ‌డ‌డంతో కార్మికుల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతోంది. అప్ప‌ట్లోనే అధికారులు హ‌డావుడి చేసి విశాఖ‌లో ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిశ్ర‌మ‌లు 267 ఉన్నాయ‌ని గుర్తించారు. వాటిపై త‌నిఖీలు చేసి 121 సంస్థ‌ల్లో లోపాల‌నున్న‌ట్టు గ్ర‌హించి నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. సాధార‌ణంగా ప్ర‌తి పరిశ్ర‌మ‌పైన చ‌ట్ట ప్ర‌కారం సేఫ్టీ ఆడిట్ల‌ను నిర్వ‌హించాలి. అయితే ఈ ఆడిట్లు ప్ర‌భుత్వ ప‌రంగా కాకుండా ప్రైవేటు సంస్థ‌లే చేస్తుండ‌డంతో అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి.
ఇలాంటి విధాన ప‌ర‌మైన లోపాల‌తో త‌ర‌చు ప్ర‌మాదాలు జ‌రుగుతూ అవి పీడ‌క‌ల‌ల్లాంటి జ్క్షాప‌కాల‌ను ప్రోది చేస్తున్నాయి.
* 2019లో స్మైలెక్స్ ల్యాబొరేట‌రీస్‌లో ఇద్ద‌రు చ‌నిపోగా, విజ‌య‌శ్రీ ఆర్గానిక్స్ ప్ర‌మాదంలో ఒక‌రు మ‌ర‌ణించారు.
* 2020లో ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌లో ఇద్ద‌రు తుది శ్వాస విడిచారు. గాఢ‌మైన ర‌సాయ‌న వాస‌న‌లు వ్యాపించ‌డంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
* సాయినార్ ఫార్మాలో 2020లో ఇద్ద‌రు క‌న్నుమూశారు.
* 2022లో రాంకీ పంప్ హౌస్‌లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు.
సాధార‌ణంగా ప‌రిశ్ర‌మ‌ల్లో అనేక లోపాలు, లోటుపాట్లు కాల‌క్ర‌మేణా పేరుకుపోతుంటాయి. ద‌శాబ్దాల నాటి పాత యంత్రాల‌నే వాడుతుంటారు. కొత్త ఆధునిక యంత్రాల‌ను కొనుగోలు చేయ‌డంలో ఆస‌క్తి చూపించ‌రు. పెరుగుతున్న సాంకేతిక ప్ర‌యోజ‌నాల‌ను అందుకోవ‌డంలో కూడా ఉదాసీన‌త చూపిస్తుంటారు. ప్రమాదాల స‌మ‌యంలో హెచ్చ‌రించే ఆధునిక ఆటోమేష‌న్ వ్య‌వ‌స్థ‌ను అనుసంధానించుకోరు. వివిధ రసాయ‌నాల‌ను నిల్వ చేయ‌డంలో కూడా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోరు. ఎక్కువ వేత‌నాలు ఇవ్వాల్సి వ‌స్తుంద‌నే ఉద్దేశంతో కొన్ని యంత్రాలు, వ్య‌వ‌స్థ‌ల వ‌ద్ద నిపుణుల‌ను, అర్హుల‌ను కాకుండా మామూలు ప‌నివాళ్ల‌ను తీసుకుంటూ ఉంటారు.
ఇన్ని లోపాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ, ప‌రిశీలిస్తూ, త‌నిఖీలు చేస్తూ నియంత్రించాల్సిన అధికారులు, పాల‌కులు అంతులేని నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం వ‌ల్ల త‌ర‌చు ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలు అనుక్ష‌ణం పెరిగిపోతున్నాయి. ప్ర‌జల ప్రాణాల‌ను గాలిలో దీపాలుగా మారుస్తున్నాయి!