జగన్ రెడ్డి దమ్ము ఏంటో.. జనసేన దమ్ము ఏంటో చూపిద్దాం!

* ఎన్నికల వేళ రాజకీయాలు చేద్దాం.. రైతులను ఆదుకునే విషయంలో కాదు
* ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు చేయడానికి ముఖ్యమంత్రికి సిగ్గుండాలి
* కరెంటు కోతలతో రైతాంగం అల్లాడుతోంది
* ఈ ముఖ్యమంత్రికి మానవత్వం లేదు
* చింతలపూడి రచ్చబండ వేదికపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

‘ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు దాని గురించి మాట్లాడాలి.. పాలన గురించి ప్రజలకు వివరించాలి. దానిని పూర్తిగా పక్కన పెట్టి రాజకీయ విమర్శలకు దిగడం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే చెల్లింద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి లో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. కౌలు రైతుల సమస్యలు కనీసం పట్టించుకోని ప్రభుత్వం తీరు అత్యంత దారుణం అన్నారు. చింతలపూడి రచ్చబండ వేదిక నుంచి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రసంగిస్తూ “ప్రభుత్వ వేదికలపై ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమాల గురించి కాకుండా జనసేన పార్టీని విమర్శించడం ఏమిటి? ఈ ముఖ్యమంత్రికి సిగ్గు ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాల వేదికపై రాజకీయ విమర్శలు చేయకూడదు అన్న జ్ఞానం ఉండాలి. భయంతో మాట్లాడే మాటలు ఆపి, రైతులను ఆదుకునే దారి చూడాలి. వారి కుటుంబాలను పరామర్శించాలి. హామీ ఇచ్చినట్లుగా వారికి ఏడు లక్షల రూపాయల సహాయం వెంటనే అందించాలి. అంతేగాని ప్రజా వేదికలపై ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. మూడు వేల మంది రైతులు మూడు సంవత్సరాల్లో ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వానికి కనీసం పట్టడం లేదు. కొన్ని జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలను నమోదు చేయడానికి సైతం అధికారులు ముందుకు రాకపోవడం దురదృష్టకరం. 11 మంది చింతలపూడి నియోజకవర్గంలో, ఏడుగురు పోలవరం నియోజకవర్గంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో 370 మంది, అనంతపురం జిల్లాలో 170 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అన్నపూర్ణ లాంటి ఉభయగోదావరి జిల్లాల్లోనూ 87 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోవడం శోచనీయం. మూడో నాలుగో ఎకరాలు కౌలుకు చేసుకొని కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకువద్దామని రైతులు సాగు చేస్తున్నారు. పంట నష్టం, గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులకు సమాధానం చెప్పలేక కన్నబిడ్డలను వదిలి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అన్నదాతల ఆత్మహత్యలు నివారించే మార్గాన్ని చూడాలి.
* కరెంటు కోతలతో రైతాంగం అల్లాడుతోంది
ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ఎన్నికల్లో అన్ని వర్గాలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. రాష్ట్రంలో కరెంటు చార్జీల బాదుడు ఒకపక్క… కరెంట్ కోతల మోత మరో పక్క అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం పంట కీలకదశలో ఉన్న సమయంలో కరెంటు లేక రైతాంగం అల్లాడుతోంది. పంటకు నీరు అందక, కరెంటు కోతలతో రైతాంగం సతమతమవుతోంది. దీనిని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి. రాష్ట్రాన్ని అంధ కారంలోకి నెట్టేసిన ఈ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. కౌలు రైతుల భరోసా యాత్ర కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అసలు కౌలు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..? వారికి వచ్చిన కష్టం ఏంటి? ప్రభుత్వం వారి ఆత్మహత్యల మీద ఎందుకు స్పందించడం లేదు? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పరిస్థితి ఏమిటి? అనే అనేక అంశాలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఈ యాత్ర మొదలుపెట్టారు. రైతు కుటుంబాలకు భరోసాగా ఉండడానికి ఆయన వంతుగా రూ.ఐదు కోట్ల విరాళం ఇచ్చి.. ప్రతి కుటుంబానికి అండగా నిలిచేందుకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇది ప్రతి జనసేన కార్యకర్త ఛాతి ఉప్పొంగి చెప్పే గొప్ప కార్యక్రమం. దీనిని ప్రతి కార్యకర్త బాధ్యతగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళండి. కార్యక్రమం గొప్పదనాన్ని ప్రజలకు వివరించండి. ప్రభుత్వం కౌలు రైతులను ఎలా మోసం చేసిందో వివరించండి. ఎన్నికల వేళ రాజకీయాలు మాట్లాడదాం… జగన్ రెడ్డి దమ్ము ఏంటో.. జనసేన దమ్ము ఏంటో చూపిద్దాం. కౌలు రైతుల భరోసా యాత్ర ఇప్పటికే జనంలోకి వెళ్లింది. దీనిని మరింతగా జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయండి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు కౌలు రైతు భరోసా యాత్ర కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలుసుకున్న ఓ యువకుడు నిన్న వచ్చి కలిశాడు. తన తండ్రి సాగు కు సంబంధించి అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని నా దృష్టికి తీసుకు వచ్చాడు. వెంటనే అధ్యక్షుల వారి అనుమతితో వారికి కూడా సహాయం అందించే ఏర్పాటు చేశాం. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి అనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష. దానిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్దాం.
* కర్షకుడికి కులం ఏంటి?
అందరి కడుపు నింపే కర్షకుడికి సాయం అందించడంలో కులం ఎందుకు ప్రస్తావన వస్తోంది.? ప్రతి కులంలోనూ పేదలు ఉన్నారు. ఎంతో కొంత సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే వారు ఉన్నారు. రైతు భరోసా సాయం కోసం కులం వారిగా లెక్కలు చూసి వారికి సాయం అందించడం అత్యంత హేయం. ప్రభుత్వం రైతులకు సైతం కులం చూసి సాయం చేయడం ఎక్కడ లేదు. పాదయాత్ర వేళ ఎన్నో హామీలను రైతాంగానికి ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి లోకి వచ్చాక వాటిని పూర్తిగా మరిచి పోయారు. వాటిని మొదట పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో రైతులకు సబ్సిడీ లు లేవు. మద్దతు ధర లేదు. గిడ్డంగులు కట్టడమే మరిచిపోయారు. ఇన్ని సమస్యలను కళ్లెదుటే పెట్టుకొని ఉన్న ముఖ్యమంత్రి జనసేన పార్టీ చేస్తున్న సహాయం విషయంలో చౌకబారు విమర్శలకు దిగడం మానుకుంటే మేలు.
* ఇలాంటి ముఖ్యమంత్రి మనకొద్దు
రైతులను ఆదుకోవడానికి ఎన్ని విమర్శలు ఎదుర్కొనేందుకు అయినా జనసేన పార్టీ సిద్ధంగానే ఉంది. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించని ఈ మానవత్వం లేని ముఖ్యమంత్రి మనకొద్దు. ఏ రైతు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రైతు కష్టాలు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు మీ వెంట ఉన్నారు. వారికి అండగా నిలుస్తాం. ఖచ్చితంగా ప్రతి రైతును ఆదుకునే వరకూ రైతు భరోసా యాత్ర కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి కౌలు రైతులకు ఇస్తామని చెప్పిన ఏడు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయాల”న్నారు.
* రైతుల కళ్లలో ఆనందం నిండాలి… అదే జనసేన ఆకాంక్ష: పార్టీ పీఏసీ సభ్యులు నాగబాబు
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరి గురించి అయినా ఆలోచిస్తే, వారి క్షేమం కోసం ఏదైనా చేస్తే వారి జీవితాలు అద్భుతంగా బాగుపడతాయని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కొణిదల నాగబాబు అన్నారు. జనసేన పార్టీ తలపెట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా చింతలపూడిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “రాష్ట్రంలోని రైతుల సమస్యలు తీరి, వారి జీవితాల్లో నవ కాంతులు రావాలని ఆకాంక్షిస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలనే గొప్ప ఆలోచనే అద్భుతం. జనసేన పార్టీ సైనికుడిగా, ఒక గొప్ప నాయకుడు ఆధ్వర్యంలో పని చేస్తున్నానన్న గర్వం ఎప్పటికి ఉండిపోతుంది. కౌలు రైతులను ఆదుకోవాలని గొప్ప తలంపుతో ఇలాంటి కార్యక్రమం ప్రారంభించాలని అనుకుంటున్నట్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినపుడు మాలో ఎంతగానో స్ఫూర్తి నింపింది” ఆన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో ఈ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పి.ఎ.సి. సభ్యులు కనకరాజు సూరి, ముత్తా శశిధర్, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్, పార్టీ నేతలు మేకా ఈశ్వరయ్య, విడివాడ రామచంద్రరావు, కరాటం సాయి, చెన్నమళ్ళ చంద్రశేఖర్, శ్రీమతి కాట్నం విశాలి, శ్రీమతి కడలి ఈశ్వరి, మల్నీడి బాబీ, పి.ధర్మరాజు, శెట్టిబత్తుల రాజబాబు, సంగిశెట్టి అశోక్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, శ్రీమతి ప్రియా సౌజన్య, శ్రీమతి గంటా స్వరూప, అమ్మిశెట్టి వాసు, బోడపాటి శివదత్ తదితరులు పాల్గొన్నారు.