గల్వాన్ అమరజవాన్లు మరియు ఫ్రంట్‌లైన్ కరోనా యోధుల సేవలు చిరస్మరణీయం

దేశ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని… రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. యావత్ జాతి తరఫున గల్వాన్ లోయలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. జూన్ మాసంలో భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లద్ధఖ్‌లో దేశం కోసం ప్రాణాలర్పించిన 20 మంది అమరజవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు.

కరోనా వైరస్‌పై పోరాటంలో ముందు వరుసలో నిలుస్తున్న ‘ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్’ సేవలు అమోఘమంటూ డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది సేవలను రాష్ట్రపతి కోవింద్ కొనియాడారు. వీరి సేవలను దేశం ఎప్పటికీ గుర్తించుకుంటుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో దేశం చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తగిన సమయంలో తీసుకున్న చర్యలతో సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నట్లు పేర్కొన్నారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టాన్ని నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతం అయ్యిందని కొనియాడారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయని కితాబిచ్చారు.