కొరోనా పోరులో వైద్య సిబ్బంది సేవలు అమోఘం

కొరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం ఆయన బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఏటా నిర్వహిస్తున్న ప్రపంచ ‘వెసాక్‌’ వేడుకల్లో కీలకోపన్యాసం చేశారు. బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడి పుట్టిన రోజు సందర్భంగా బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ క్రమంలో అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్యతో కలిసి కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.

కొరోనా మహమ్మారి సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి నిత్యం నిస్వార్థంగా సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌కేర్‌ వర్కర్స్, వైద్యులు, నర్సులకు వందనం చేస్తున్నానన్నారు. అలాగే ఆత్మీయులను పోగొట్టుకున్న వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ప్రస్తుతం ఇప్పుడు మహమ్మారిపై అవగాహన ఉందని, ఇది పోరాడేందుకు అవసరమైన వ్యూహాన్ని బలపరుస్తుందన్నారు.

ప్రాణాలు కాపాడేందుకు, మహమ్మారిని ఓడించేందుకు ముఖ్యమైన టీకా మన వద్ద ఉందని, వ్యాక్సిన్లపై పని చేసిన శాస్త్రవేత్తలను చూసి దేశం గర్వపడుతుం దన్నారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 50 మంది ప్రముఖ బౌద్ధ మత నాయకులు పాల్గొన్నారు. అలాగే సాంస్కృతిక మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజీజు హాజరయ్యారు.