ఏపీలో రోజుకు 3 వందల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి లక్ష్యం

కరోనా మహమ్మారి ఉధృతి నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్ లభ్యతపై మంత్రి గౌతమ్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఏపీ అవసరాల తరువాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, కర్నాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో ఆయితే కేసుల సంఖ్య వేగంగా పెరగడంతో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఆక్సిజన్ కొరత  కారణంగా చాలా ప్రాంతాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి. ఈ నేపధ్యంలో ఏపీలో ఆక్సిజన్ లభ్యతపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వివరణ ఇచ్చారు.

రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో రాష్ట్రానికే తొలి ప్రాధాన్యత అని..రాష్ట్ర అవసరాలు తీరిన తరువాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ సరఫరా చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మెడికల్ ఆక్సిజన్ సరఫరాపై క్షత్రస్థాయి నిఘా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 40 రకాల పరిశ్రమల ద్వారా 510 ఎంటీ మెడికల్ ఆక్సిజన్ తయారీ చేస్తున్నామన్నారు. రోజుకు 3 వందల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి లక్ష్యమన్నారు. ఆక్సిజన్ సరఫరా, ఉత్పత్తిపై వివిధ శాఖల అధికారులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పరిశ్రమల వివరాల్ని తెలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి, ఆక్సిజన్ అవసరాలు వంటివాటిపై చర్చించారు.