పట్టాలెక్కనున్న ఎంఎంటీఎస్‌ రైళ్లు

ఆరున్నర నెలల నుంచి షెడ్లకే పరిమితమైన ఎంఎంటీఎస్‌ రైళ్లు అతి త్వరలోనే పట్టాలపై పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ వరుస సడలింపుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రోజులుగా అన్ని రకాల రవాణాలను ప్రారంభిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అంతర్‌ జిల్లాల బస్సులతోపాటు సిటీ బస్సులను నడిపిస్తున్నారు. అలాగే సెప్టెంబర్‌ 7 నుంచి నగరంలో మెట్రో రైళ్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో దేశంలోని వివిధ నగరాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షెడ్లకే పరిమితమైన రైళ్లకు మరమ్మతు, పరిశుభ్రత పనులు చేయిస్తున్నట్లు సమాచారం.

కాగా, రైళ్లను ప్రారంభించిన తర్వాత ప్రయాణికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో స్టేషన్లలో కొవిడ్‌ జాగ్రత్తలు కూడా తీసుకోనున్నారు. ప్రధానంగా బోగీల్లో భౌతిక దూరంతో నిలబడాలని, సీట్లలో పరిమితంగా కూర్చోవాలని, రైళ్ల తలుపులను తాకవద్దని ప్రయాణికులకు వాల్‌పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ జంట నగరాల రవాణాలో అతి కీలకమైన ఎంఎంటీఎస్‌ రైళ్లు త్వరలో సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ ధర, తక్కువ సమయంలో జంట నగరాల్లోని వివిధ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించే లోకల్‌ రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.