తెలంగాణ దళిత బంధు పథకం దేశంలోనే విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది: గోరటి వెంకన్న

ప్రముఖ గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తెలంగాణ దళిత బంధు పథకంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. దళిత బంధు పథకం దేశంలోనే విప్లవాత్మకమైన మార్పులకు దారితీస్తుందని తెలిపారు. అంబేద్కర్ తర్వాత దళితుల గురించి పట్టించుకున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.

ఒకప్పుడు కొద్దిపాటి మొత్తాన్ని లోన్ రూపంలో తీసుకునేందుకు ఎంతో కష్టపడిన దళితులు, నేడు దళిత బంధు పథకంలో భాగంగా రూ.10 లక్షలు పొందనుండడం కేసీఆర్ మానవతా దృక్పథానికి నిదర్శనమని కొనియాడారు. తెలంగాణ దళిత సమాజం వ్యాపారవర్గంగా ఎదగాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తీసుకురావడం అభినందనీయం అని పేర్కొన్నారు.

దళితులు వివక్షను అధిగమించి ఆర్థిక సామాజిక ఆత్మగౌరవాన్ని సాధించడమే నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుందని వెంకన్న అభిప్రాయపడ్డారు. దళిత బంధు పథకంపై ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హుజూరాబాద్ దళితనేతలతో అవగాహన సదస్సు జరిగింది. ఈ పథకాన్ని తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసి ఆపై రాష్ట్రవ్యాప్తం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.