గ్రామ సచివాలయాలపై ఏపీ హైకోర్టులో విచారణ… జీవో నెం.2ను సస్పెండ్ చేసిన ధర్మాసనం

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. అయితే, గ్రామ పంచాయతీల అధికారాలను గ్రామ సచివాలయాలకు బదలాయిస్తూ గతంలో ఏపీ సర్కారు నిర్ణయించడం విమర్శలపాలైంది. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, వీఆర్ఓల అధికారాలు బదిలీ అంశంలో దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.2ని సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

గతంలోనూ హైకోర్టు ఈ అంశంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఉండగా, సచివాలయాల పేరుతో మరొక వ్యవస్థ ఎందుకని ప్రశ్నించింది. రాష్ట్రంలో సమాంతర వ్యవస్థల అవసరమేంటని నిలదీసింది.