ఏపీలో తెరుచుకోనున్న థియేటర్లు

ఎప్పుడెప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, సినీ ప్రియులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో జూలై 31వ తేదీ నుంచి థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో.. కోవిడ్‌ నిబంధనలను అమలు చేస్తూ.. థియేటర్లు నడిపించాలని ప్రభుత్వం సూచించింది. అయితే 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో థియేటర్లు నడపటం తమకు నష్టమని.. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని థియేటర్‌ యజమానులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం గతంలోనే పూర్తి సామర్థ్యంతో థియేటర్లు నడిపించుకోవచ్చని అనుమతిచ్చిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోవడంతో ఎప్పటి నుంచో విడుదల కోసం ఎదురుచూస్తున్న సినిమాలు విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం సత్యదేవ్‌ నటించిన ‘తిమ్మరుసు’, తేజ-ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ జంటగా నటించిన ‘ఇష్క్‌’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.