టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన పీఏ ద్వారా శాసనమండలి చైర్మన్ షరీఫ్‌కు తన రాజీనామా లేఖను సునీత పంపారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అడుగడుగునా కోర్టులను అడ్డుపెట్టుకుని టీడీపీ, చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. టీడీపీ వైఖరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందన్నారు.

టీడీపీ వైఖరి, విధానాలకు నిరసనగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సునీత, సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా జగన్ కొనసాగిస్తున్న పాలనకు మద్దతుగా నిలవాలని రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు.